వేలూరు: తిరుపత్తూరు జిల్లా కునిసి మోటూరు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ 100 మందికి పైగా విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఒకరు పాఠ్యాంశంలోని ఓ సంగీతం గురించిన పాఠాన్ని బోధించారు. ఆ సమయంలో ఆ సంగీతాన్ని ఓ కులానికి చెందిన వారు మాత్రమే ఉపయోగిస్తారని విద్యార్థి పుస్తకంలో ఆ విద్యార్థి కులం పేరును రాసి అందరి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ విద్యార్థి ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో రెండు రోజుల అనంతరం గ్రామ పెద్దలు పాఠశాలకు వెళ్లి టీచర్‌ను నిలదీశారు. ఇందుకు టీచర్ సరైన సమాధానం చెప్పలేదు. అనంతరం కునసి మోటూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు, వీసీకే కార్యకర్తలు సంయుక్తంగా మంగళవారం మధ్యాహ్నం పాఠశాలను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థి కులం పేరును పాఠ్య పుస్తకంలో రాసిన టీచర్‌ను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ సీఈఒ పున్యకోటి, తహసీల్దార్ నవనీతమ్, పోలీసులు సంగటనా స్థలానికి చేరుకొని స్థానికులతో చర్చలు జరిపారు. టీచర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన కారులు ధర్నాను విరమించారు. వీటి పై అధికారులు విచారణ జరిపారు. అనంతరం విద్యార్థి పాఠ్య పుస్తకంలో కులం పేరు రాసిన విషయం నిర్ధారణ కావడంతో టీచర్ విజయకుమార్‌ను సస్పెండ్ చూస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment