ఇటుక బట్టీలో కలకలం
తిరువళ్లూరు: ఓ ప్రైవేటు వ్యక్తి నడుపుతున్న ఇటుక బట్టీలో వరుసగా మూడు రోజుల్లో చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందిన సంఘటన తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. వరుసగా ముగ్గురు మృతి చెందిన క్రమంలో అధికారులు బట్టీకి పరుగులు పెట్టి ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెంగల్ సమీపంలోని ఎగువ కొండయూరు గ్రామంలో అన్నై ఇటుకబట్టీ వుంది. ఈ బట్టీని కొమక్కంబేడు గ్రామానికి చెందిన శ్రీధర్ నిర్వహిస్తున్నాడు. బట్టీలో ఒడిశా, ఉత్తర ప్రదేష్, చత్తీష్‌ఘడ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 350 మంది కార్మికులు ఇక్కడ ఇటుకల తయారీలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గత నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ మూడునెలల చిన్నారి మృతి చెందింది. బట్టీలో పని చేస్తున్న మరో పది మందికి వాంతులు విరోచనాలై పరిస్థితి విషమంగా మారడంతో బాధితులను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్రమంలో రామకృష్ణత్యాగు(52), ఒడిశాకు చెందిన హైదర్ చండా(52) తదితర ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి మృతదేహాలకు మంగళవారం శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. వరుసగా మూడురోజుల్లో ముగ్గరు మృతి చెందిన సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు
సమాచారం అందుకున్న డీసీబీ డీఎస్పీ లోకేశ్వరన్ నేతృత్వంలోని పోలీసులు ఇటుకబట్టీకి చేరుకుని విసృతంగా తనిఖీలు చేపట్టారు. వరుస ముగ్గురు మృతికి గల కారణాలపై ఇటుక బట్టీ యజమాని, సహచర కార్మికుల వద్ద విచారణ చేపట్టారు. దీంతో పాటు తిరువళ్లూరు డివిజన్‌కు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ సుభాష్‌చంద్రభోస్ నేతృత్వంలో వెళ్లియూర్, వెంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంఽద్రానికి చెందిన వైద్యులు, నర్సులతో ప్రత్యేకంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. తాహసీల్దార్ రజినీకాంత్, బీడీఓలు గుణశేఖరన్, రవి తదితరులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. అక్కడ అనారోగ్యంతో భాదపడుతున్న వారికి అవసరమైన వైద్యసేవలను అందించాలని ఆదేశించారు.
సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు
ఇటుక బట్టీలో వరుసగా ముగ్గురు మృతి చెందడం, పలువురు అనారోగ్యానికి గురి కావడం కలకలం రేపింది. దీంతో పోలీసులు, అధికారులు బట్టీకి పరుగులు పెట్టారు. పోలీసుల రాక, విచారణ పేరుతో తరచూ అధికారులు ఇట్టీలోనే మకాం వేయడంతో రాత్రికి రాత్రే కార్మికులు తట్టాబుట్టా సర్దుకుని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. కాగా ఇటుక బట్టీలో అపరిశుభ్రంగా వుండడంతో పాటు కార్మికులు వారం రోజుల క్రితం కోడిబోటీ(కోళ్ళ పేగులను) వండి తిన్నట్టు గుర్తించారు. కోడిబోటీ పుడ్‌ఫాయిజన్ కావడం వల్లే మృతి చెంది ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. దీంతో పాటూ కార్మికులు నివాసం వుంటున్న ప్రాంతం అపరిశుభ్రంగా వుండడంతో పాటు తాగునీరు కలుషితం కావడం వల్లే విషజ్వరాలు ప్రబలి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
మూడురోజుల్లో అనారోగ్యంతో చిన్నారి సహా ముగ్గురి మృతి
అధికారుల పరుగులు
Comments
Please login to add a commentAdd a comment