విద్యార్థుల కోసం హ్యకథాన్
● మంత్రి పళణి వేల్ త్యాగరాజన్
సాక్షి, చైన్నె: విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చే విధంగా రాష్ట్రవ్యాప్తంగా హ్యాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఐటీ మంత్రి పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్ తెలిపారు. విద్యార్థులు ఆలోచించేందుకు సరైన వేదికను గుర్తించి అందించాల్సిన అవస్యకతను సూచించారు. విద్యార్థులకు వివిధ టెక్ స్పేస్‌లలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇవ్వబడతాయని తెలిపారు. నో యువర్ నైబర్‌హుడ్ (కేవైఎన్) కనెక్టివిటీ యాప్, తమిళనాడులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ మంత్రిత్వ శాఖ, ఐసీటీ అకాడమీ భాగస్వామ్యంతో కిన్నోవెట్ –2025 సమ్మిట్ కార్యక్రమం మంగళవారం స్థానికంగా జరిగింది. ఇందులో హై–ఇంపాక్ట్ హ్యాకథాన్, ఆవిష్కరణ, సహకారం, సృజనాత్మక సమస్య పరిష్కారాన్ని ప్రోత్సహించే విధంగా శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. అలాగే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇందులో 50కు పైగా ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలకు చెందిన 1,100 మందికిపైగా విద్యార్థులు 25 బృందాలుగా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో టాప్ 5 విజేతలను ప్రకటించారు. వీరిలో ఆర్‌ఎంకే ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన నవీనా తమిళర్ విజేతగా నిలిచి రూ. లక్ష నగదు బహుమతి దక్కించుకుంది. ఇదే కళాశాలకు చెందిన యూత్ టెక్ జట్టు ద్వితీయ బహుమతిని గెలుచుకుంది. శ్రీపెరంబుదూర్‌లోని శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన టీమ్ టెక్ ఇజాస్ జట్టు సైతం రాణించింది. ఈ బృందం మూడవ బహుమతిని గెలుచుకుంది. చైన్నె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు జట్లకు ఇంటర్న్‌షిప్ అవకాశంతో పాటూ ఒక్కొక్కరికి రూ.10,000 నగదు బహుమతిని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , డిజిటల్ సేవల మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ బహుమతులను అందజేసి ప్రసంగించారు. రానున్న రోజులలో విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు, రాష్ట్రవ్యాప్త హ్యాకథాన్‌లను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు ఆలోచించేందుకు సరైన వేదికను గుర్తించి అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కేవైఎన్ సీఈఓ గాయత్రి త్యాగరాజన్ మాట్లాడుతూ కేవైఎన్ కమ్యూనిటీలను బలోపేతం చేయడం, ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలను అందించడంపై నమ్మకం కలిగిస్తున్నామన్నారు. ఆలోచన , కోడింగ్ ద్వారా వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి యువతను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment