ఢిల్లీకి అరిటాపట్టి వాసులు
● టంగ్ స్టన్ తవ్వకాల అనుమతి రద్దుకు పట్టు
సాక్షి, చైన్నె: టంగ్‌స్టన్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులను కలిసేందుకు మదురై అరిటా పట్టి పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. మదురై మేలూరు పరిసరాలలో టంగ్‌స్టన్ మైనింగ్ తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడం ఆ పరిసరాలలోని రైతులలో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలు వ్యవసాయ క్షేత్రాలుగా ఉండటమే కాకుండా, పురాతన, చరిత్రకు నిదర్శనంగా నిలిచే ఎన్నో కట్టడాలు, ఆలయాలు ఉండటాన్ని పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా టంగ్ స్టన్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఈ పరిస్థితుల్లో ఈ టంగ్ స్టన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమ కారులు తక్షణం మేలూరు పరిసరాలను సురక్షిత వ్యవసాయ క్షేత్రాలుగా ప్రకటిస్తూ తీర్మానం చేసి, గెజిట్‌లో ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం ఆమోదించాలని, టంగ్‌స్టన్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేయడం కోసం అరిటా పట్టి గ్రామానికి చెందిన ప్రజలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీలకు అతీతంగా ఉన్న ఉద్యమ కమిటీలోని బీజేపీకి చెందిన సుశీంద్రన్, ప్రొఫెసర్ రామశ్రీనివాసన్, రాజసింహన్, బాల మురుగన్, మునియప్పన్‌తో కలిసి రైతులు, గ్రామీణ ప్రజలు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలను అందించనున్నారు.
చర్చలకు రండి..
● రవాణాశాఖ కార్మికులకు పిలుపు
సాక్షి, చైన్నె: వేతన నిర్ణయం తదితర డిమాండ్లపై చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు రవాణా సంస్థ పిలుపు నిచ్చింది. ఫిబ్రవరి 13,14 తేదీలలో ఈమేరకు చర్చలకు నిర్ణయించారు. రాష్ట్ర రవాణా సంస్థలోని అన్నా, సీఐటీయూ, తదితర కార్మిక సంఘాలు తమ డిమాండ్ల పరిష్కారం నినాదంతో ఆందోళనలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో వేతన పెంపు తదితర అంశాలను డీఎంకే కూటమి పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కార్మిక సంఘాలతో చర్చలకు రవాణా సంస్థ నిర్ణయించింది. వేతన పెంపు ఒప్పందాలపై చర్చించి నిర్ణయం తీసుకుందామని కార్మిక సంఘాలకు మంగళవారం రవాణాశాఖ నుంచి పిలుపు వెళ్లింది. ఈ మేరకు చైన్నెలో ఫిబ్రవరి 13,14 తేదీలలో చర్చలు జరగనున్నాయి.
ఎంపీ కదీర్ ఆనంద్ కళాశాలలో రూ. 13.7 కోట్లు స్వాధీనం
● చైన్నెలో ఈడీ అధికారుల ప్రకటన
వేలూరు: రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ కుమారుడు వేలూరు పార్లమెంట్ సభ్యులు కదీర్ ఆనంద్‌కు సొంతమైన ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు వారాల క్రితం ఈడీ అధికారులు అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మంత్రి దురై మురుగన్ ఇల్లు, అతని అనుచరులు పూంజోలై శ్రీనివాసన్, దామోదరన్ వంటి వారి ఇంటిలో సోదాలు నిర్వహించారు. మూడు రోజుల పాటూ తరచూ తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం చైన్నెలోని ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో.. ఎంపీ కదీర్‌ఆనంద్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి రూ. 13.7 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు, కదీర్ ఆనంద్ లాకర్ నుంచి రూ. 75 లక్షలు స్వాఽధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా కళాశాల నుంచి ఆస్తుల వివరాలను హార్డ్ డిస్క్‌తో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నేటి నుంచి 24వ తేదీ వరకు తాగునీటి సరఫరా నిలిపివేత
● చైన్నె వాటర్ బోర్డు నోటీసు
కొరుక్కుపేట: ఆలందూరు మండలం పాల్ వెల్స్ రోడ్డులో 22వ తేదీ బుధవారం రాత్రి 9 గంటలకు చైన్నె మెట్రో రైల్ కంపెనీ ప్రధాన నీటి పైపును మార్చే పనులను చేపట్టనున్నారు. ఈ మేరకు చైన్నె డ్రింకింగ్ వాటర్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆలందూరు మండలం పాల్ వెల్స్ రోడ్డులోని ప్రధాన తాగునీటి పైపును చైన్నె మెట్రో రైల్ మార్చనుంది. 22వ తేదీ రాత్రి 9 నుంచి 24వ తేదీ రాత్రి (48 గంటలు) తేనాంపేట, కోడంబాక్కం, వలసరవాక్కం, ఆలందూరు, అడయారులో కొన్ని ప్రాంతాలు, పల్లావరం నాగరత్ వరద ముంపు ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా నిలిచిపోతుంది. అలాగే జోన్– 9 (తేనాంపేట్)–ఎంఆర్‌సీ నగర్, జోన్–ఎం (కోడంబాక్కం) ఎకతుతంగల్, జోన్– 11 (వలసరవాక్కం), వలసరవాక్కం (ప్రాంతం) రామాపురం జోన్ 12 (అలదూర్) మొఘలివాక్కం, మనప్పక్కం, నందంబాక్కం, అలందూర్, నంగనల్లూర్, ఆడమప్పక్కం, మీనంబాక్కం, జోన్–13 (అడయారు) , వేలచ్చేరి, పల్లవరం మున్సిపాలిటీ కౌల్ బజార్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా సరిపడా తాగునీరు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. బోర్డు వెబ్‌సైట్ చిరునామాను ఉపయోగించి అత్యావసర అవసరాల కోసం ట్రక్కుల ద్వారా నమోదు చేసుకుని తాగునీటిని పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment