ఈరోడ్ బరిలో 46 మంది అభ్యర్థులు
సాక్షి, చైన్నె: ఈరోడ్ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికలలో 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తుది జాబితాలోని సమగ్ర సమాచారాలు మంగళవారం వేకువ జామున వెలువడ్డాయి. ఇందుకు కారణం ఓ అభ్యర్థి నామినేషన్ వివాదాస్పదం కావడమే. వివరాలు.. ఈవీకేఎస్ మరణంతో ఖాళీగా ఉన్న ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకునేందుకు డీఎంకే అభ్యర్థిగా చంద్రకుమార్ పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే, తమిళగ వెట్రి కళగం వంటి పార్టీలు ఉప ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో నామ్ తమిళర్ కట్చి, డీఎంకే మధ్య ఈసారి ప్రధాన సమరం నెలకొంది. నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా సీతాలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న వారి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగిసింది. 47 మంది పోటీలో ఉన్నట్టు తేలింది. అయితే ఓ అభ్యర్థి నామినేషన్ వివాదాస్పదంగా మారింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు కృష్ణ రాజపురం నియోజకవర్గంలో ఓటుహక్కు కలిగిన పద్మావతి అనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఈ వివాదానికి కారణమైంది. ఈమె నామినేషన్ తొలుత అమోదం పొందింది. అయితే, ఆమె ఓటు అన్నది తమిళనాడులో కాకుండా కర్ణాటకలో ఉన్నట్టు చివరి క్షణంలో వెలుగు చూసింది. దేశంలో ఎక్కడ ఓటు హక్కు ఉన్నా సరే ఇతర ప్రాంతాలలో జరిగే లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రతి పౌరుడికి వీలుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఇది వర్తించదన్న విషయం మీద తర్జనభర్జన పడాల్సిన పరిస్థితి చివరి క్షణంలో అధికారులకు తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే వారు సంబంధిత రాష్ట్ర ఓటరుగా ఉండాల్సి ఉందన్న నిబంధన తేట తెల్లం కావడంతో చివరి క్షణంలో ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో తుది జాబితా తయారీకి అర్ధరాత్రి సమయం పట్టింది. మంగళవారం ఉదయాన్నే తుది జాబితా వెలుగులోకి వచ్చింది. ఈ ఉప ఎన్నికలలో డీఎంకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులతో పాటూ 46 మంది పోటీలో ఉన్నట్టు ఖరారైంది. దీంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. భారీ ఆధిక్యంతో గెలుపు లక్ష్యంగా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. మంత్రి ముత్తుస్వామి తమ అభ్యర్థి చంద్రకుమార్ గెలుపు బాధ్యతలను తమ భుజాన వేసుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో ఎన్నికల యంత్రాంగం సైతం నియోజకవర్గంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. వాహన తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా నామినేషన్ వెనక్కి తీసుకున్నా, తనను పార్టీ నుంచి తొలగించడంతో అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం ఈరోడ్ సంయుక్త కార్యదర్శి సెంథిల్ మురుగన్ కండువా మార్చేశారు. మంత్రి ముత్తుస్వామి సమక్షంలో మంగళవారం డీఎంకేలో చేరారు.
ప్రచారంలో మంత్రి ముత్తుస్వామి, చంద్రకుమార్
Comments
Please login to add a commentAdd a comment