డెల్టాకు కేంద్ర బృందం
● పంటనష్టంపై నేడు పరిశీలన
సాక్షి, చైన్నె: అకాల వర్షం సృష్టించిన పంట నష్టం తీవ్రతను అంచనా వేయడానికి కేంద్ర బృందం రంగంలోకి దిగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ప్రత్యేక బృందాన్ని మంగళవారం నియమించారు. ఈ బృందం బుధవారం తమిళనాడుకు రానుంది. వివరాలు.. ఈశాన్య రుతు పవనాల సీజన్ ఓ వైపు ముగిసిందో లేదో మరో వైపు శని, ఆదివారాలలో అకాల వర్షం అనేక జిల్లాలలో తాండవం చేసింది. ఈశాన్య రుతు పవనాల రూపంలో ఎదురైన నష్టాలు, కష్టాలు ఓ వైపు ఉంటే, మరో వైపు ఈ అకాల వర్షం డెల్టాలోని పలు జిల్లాల రైతుల కంట కన్నీళ్లు పెట్టించాయి. ఏపుగా పెరిగిన వరి పంట దెబ్బ తినడంతో అప్పుల ఊబిలో తాము కూరుకుపోయమన్న వేదనలో అన్నదాతలు మునిగిపోయారు. డెల్టాలోని నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, మైలాడుతురై జిల్లాలో సుమారు లక్ష ఎకరాలలో సంబా వరి పంట వర్షార్పణమైంది. అలాగే మరెన్నో వేల ఎకరాలలో ఉద్ది, పెసర పప్పు దినుసుల పంటలు దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని అన్నదాత చేసుకున్న విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పంట నష్టంపై అంచనా వేసి, రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపించింది. అలాగే, ఆహార భద్రతా విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి జే రాధాకృష్ణన్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆహార భద్రతా విభాగం కార్యదర్శి సంజీవ్ కోబ్రాను కలిసి ఇక్కడ అకాల వర్షం సృష్టించిన విలయం, నష్టం తీవ్రతను వివరించారు. దీంతో ఆయన స్పందించారు. ప్రత్యేక బృందాన్ని తమిళనాడుకు పంట నష్టం అంచనా నిమిత్తం పంపించేందుకు మంగళవారం నిర్ణయించారు. ఆహార భద్రతా విభాగం పరిధిలోని పరిశోధన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్లు నవీన్, టీఎం ప్రీతి, సాంకేతిక నిపుణులు రాహుల్, అభిషేక్ పాండేలతో కూడిన కమిటీని నియమించారు. ఈకమిటీ బుధవారం చైన్నెకు రానుంది. ఇక్కడి అధికారులతో భేటి అనంతరం నాగపట్నం, తిరువారూర్, తంజావూరు జిల్లాలలో పర్యటించనుంది. వరి కొనుగోలు కేంద్రాలలో 17 శాతం తేమ ఉన్న పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, తాజా వర్షాల దృష్ట్యా, 22 శాతం తేమ ఉన్న వరిని కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అన్నదాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
దెబ్బతిన్న పంటను చూపిస్తున్న అన్నదాత
Comments
Please login to add a commentAdd a comment