రామకృష్ణ మఠంకు స్పిరిట్ ఆఫ్ మైలాపూర్ అవార్డు
సాక్షి, చైన్నె: చైన్నెలోని రామకృష్ణ మఠానికి స్పిరిట్ ఆఫ్ మైలాపూర్ – 2025 అవార్డు దక్కింది. ఈ అవార్డును సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ ప్రదానం చేసింది. సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ నేతృత్వంలో 125 సంవత్సరాలుగా మైలాపూర్ సంస్కృతి, సాంస్కృతికం, విద్యా, ఆరోగ్య సంరక్షణలో భాగంగా మైలాపూర్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది వేడుకలకు స్మారక సహకారానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన స్పిరిట్ ఆఫ్ మైలాపూర్ అవార్డు 2025ను చైన్నెలోని రామకృష్ణ మఠానికి అందజేసింది. ఈ సంస్థ తమిళనాడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ మోహన్ వెంకటేశన్ ఈ అవార్డును రామకృష్ణ మఠం వర్గాలకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పిరిట్ ఆఫ్ మైలాపూర్ అవార్డ్‌ను తొలిసారిగా 2009లో ప్రారంభించామన్నారు. మైలాపూర్‌లోని దీర్ఘకాల నివాసితులు ఐకానిక్, వారసత్వం, సంస్కృతికి విశిష్టమైన కృషి చేసిన సంస్థలను గౌరవించే విధంగా ఈ అవార్డును అందజేస్తూ వస్తున్నామన్నారు. 1897లో చైన్నెలో రామకృష్ణ మఠం స్వామి రామకృష్ణానందచే స్థాపించ బడిందన్నారు. దక్షిణాదిలో తొలిశాఖ మైలాపూర్‌లో ముఖ్యమైన ఆధ్యాత్మిక మైలురాయిగా నిలిచి ఉందన్నారు. ఈ మఠం సామాజిక పరివర్తన, విద్య, ఆరోగ్య సంరక్షణ , సమాజ సేవ రంగాలతోపాటూ ఉత్తమ బోధనలతో తరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. వివేకానంద సెంటినరీ హయ్యర్ సెకండరీ స్కూల్, శ్రీ రామకృష్ణ మఠం నేషనల్ స్కూల్ వంటి సంస్థల ద్వారా విద్యకు ఎంతోకృషి చేస్తున్నారని వివరించారు. ఇక్కడ రెండు దశాబ్దాలుగా నిరుపేద గ్రామీణ బాలికలకు ఉచితంగా నర్సింగ్ అసిస్టెంట్ కోర్సును అందిస్తున్నారని పేర్కొంటూ, స్పిరిట్ ఆఫ్ మైలాపూర్ అవార్డును రామకృష్ణ మఠానికి అందించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment