సాక్షి, చైన్నె: చైన్నెలో తొలి ప్రయత్నంగా కేబుల్ సాయంతో వేలాడే వంతెన ఏర్పాటుకు కార్పొరేషన్ కసరత్తు చేపట్టింది. శాంతోమ్ – గ్రీన్ వేస్ రోడ్డును అనుసంధానించే విధంగా ఈ కేబుల్ ఫుట్ ఓవర్ వంతెన రూపుదిద్దుకోనున్నది. సాధ్యాసాధ్యాల నివేదికకు టెండర్లను ఆహ్వానించారు. వివరాలు.. చైన్నెలో శాంతోమ్, గ్రీన్ వేస్ రోడ్డులు రద్దీతో కూడుకున్నవి. గ్రీన్ వేస్ రోడ్డు మంత్రులు, అధికారుల క్వార్టర్లుతో నిండి ఉంటుంది. ఈ పరిసరాలలో విద్యా సంస్థలు సైతం అనేకం ఉన్నాయి. ఈ మార్గాలను విస్తరించడం కష్టతరమే. రద్దీతో కూడుకున్న ఈ పరిసరాలలో ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి జనాన్ని గట్టెక్కించేందుకు కొత్త ప్రయత్నంపై కార్పొరేషన్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడయార్ వంతెన ఆధారంగా గ్రీన్ వేస్ రోడ్డు, శాంతోమ్ రోడ్డులను అనుసంధానించే విధంగా పట్టినంబాక్కం, శ్రీనివాసపురం, బీసెంట్ నగర్ మధ్య అడయార్ నదిపై కేబుల్ వంతెన నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన సాధ్యా అసాధ్యాల నివేదిక రూపకల్పనకు రూ. 25 లక్షలను కేటాయించారు. ఇందుకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించారు. ఈ వంతెన మార్గం పూర్తిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి తరహాలో కేబుల్ సాయంతో వేలాడే వంతెనగా రూపొందించనున్నారు. సాధ్యాసాధ్యాల నివేదిక ఆధారంగా మూడు విడుదలలో పనులు చేపట్టే దిశగా నిర్ణయించారు.
పారిశ్రామిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు
సాక్షి, చైన్నె : కేంద్ర బడ్జెట్ వ్యవసాయం, తయారీ రంగాలలో వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రయోజనకరంగా, ఎగుమతులకు తోడ్పాటుగా ఉంటుందని సీఐఐ సమీక్షలో నిపుణులు వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ దాఖలు సమయంలో చైన్నెలో సీఐఐ నేతృత్వంలో సమీక్ష సమావేశం చైన్నెలో జరిగింది. ఇందులో సీఐఐ సదరన్ రీజియన్ చైర్ పర్సన్ డాక్టర్ ఆర్ నందిని మాట్లాడుతూ, ఎంఎస్‌ఎంఈలకు సాధికారత కల్పించడం, రుణ సదుపాయాలను పెంపొందించడం, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా ఓ స్థితిస్థాపక పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను రూపొందించినట్లయ్యిందన్నారు. ప్రధానంగా మహిళలు, అట్టడుగున ఉన్న వారికి రుణాల కల్పన ఒక ముందడుగా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, మొబైల్ ఫోన్, బ్యాటరీ ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ద్వారా తమిళనాడులోని తయారీ రంగం గణనీయంగా ప్రయోజనం పొందుతుందన్నారు. తమిళనాడు బలమైన ఆటో, అనుబంధ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చొరవచూపించినట్టుందని సీఐఐ తమిళనాడు స్టేట్ కౌన్సిల్ ప్రతినిధి శ్రీవత్స్ రామ్ ఈసందర్భంగా సూచించారు. రైతులకు మద్దతు నిలవడం తమిళనాడు వ్యవసాయ సమాజానికి కీలక మద్దతుగా అభివర్ణించారు.
సీనియర్ నిర్మాత
నటరాజన్ కన్నుమూత
తమిళసినిమా: కోలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాత వి.నటరాజన్ (70) శుక్రవారం అర్ధరాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆనంది ఫిలిమ్స్ పతాకంపై పలువురు ప్రముఖ హీరోలతో ఈయన చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా రజినీకాంత్ కథానాయకుడుగా ముల్లుమ్ మలరుమ్, విజయ్ కాంత్ హీరోగా చిన్నగౌండర్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రధాన పాత్రలో నటించిన నదియై తేడి వంద కడల్, ప్రభు హీరోగా ఉత్తమ పురుషన్, ధర్మశీలన్ , రాజా కయ్య వచ్చా, సత్యరాజ్ నటించిన పంగాళి, భారతీరాజా దర్శకత్వంలో శివాజీ గణేషన్, ప్రభు హీరోలుగా నటించిన పశుమ్ పొన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఈయన మృతి సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా నటరాజ్ జ్యోతి అనే భార్య, సెంథిల్, విక్కీ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. నటరాజన్ భౌతిక కాయానికి శనివారం సాయంత్రం స్థానిక మైలాపూర్ లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈపీఎస్ ఫిర్యాదు రద్దు చేయాలి
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే అంతర్గత పార్టీ వ్యవహారాలకు సంబంధించి విచారణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను చైన్నె హైకోర్టు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఈ కేసు విచారణ సమయంలో చైన్నె హైకోర్టులో ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాధానంలో ఆరు ఫిర్యాదులు వచ్చి ఉండడంతో అన్ని కలిపి విచారణ చేపట్టాలని ఎన్నికల కమిషన్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment