ఆకస్మిక తనిఖీల పేరుతో క్షేత్రసాయి సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడ పరిష్కరించాలని సీఎం స్టాలిన్ సూచించారు. ఈ మేరకు కొత్త కలెక్టర్లకు ఆయన శనివారం పలు సూచనలు చేశారు.
సాక్షి, చైన్నె : ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని కొత్త కలెక్టర్లకు సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. సచివాయలంలో శనివారం 9 జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో 36 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు జిల్లాలకు కొత్త వారిని కలెక్టర్లను నియమిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈమేరకు ఆర్. సతీష్ (ధర్మపురి), ఎస్. శరవణన్ (దిండిగల్), ఎం. ప్రతాప్ (తిరువళ్లూరు), సి. దినేష్ కుమార్ (కృష్ణగిరి), ఎస్. షేక్ అబ్దుల్ రెహమాన్ (విల్లుపురం), కె. ధర్మరాజ్ (తిరువణ్ణామలై), మోహనచంద్రన్ (తిరుపత్తూరు), ఆర్. సుకుమార్ (తిరునెల్వేలి),కె. శివసౌందరవల్లి (తిరువారూర్)లను కొత్త కలెక్టర్లుగా నియమించారు. వీరితో సచివాలయంలో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, నేటి నుంచి ప్రజలతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ వారి సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరించే విధంగా పని తీరు ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఐకానిక్ పథకాలు, రోజువారీ అమలు పథకాలు, పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల అవసరాలను తీర్చే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు.
తమిళనాడుకు గొప్ప విజయం
అనంతరం సీఎం స్టాలిన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఇందులో తోలు వస్తువుల ఎగుమతులు, పాదరక్షల తయారీలో 2 లక్షల మందికి ఉద్యోగ కల్పన అవకాశాలలో తమిళనాడు సాధించిన గొప్ప విజయం గురించి ప్రస్తావించారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకటనలో తమిళనాడు ప్రభుత్వం పరిశోధన, విద్యా కార్యక్రమాలు, తోలు వస్తువుల తయారీ పరిశ్రమలో అగ్రగామి వంటి అంశాలను గుర్తు చేస్తూ తన ప్రకటనలో సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. దేశంలో తోలు వస్తువుల ఉత్పత్తి 38 శాతం వాటాగా ఉందని గుర్తు చేస్తూ, ఎగుమతుల్లో తమిళనాడు వాటా 47 శాతంగా ఉండటం, 2 లక్షల మందికి పైగా ఉద్యోగ ఉపాది అవకాశాలను కల్పించడం అధ్యయనం వెలుగు చూసినట్టు పేర్కొనడం తాము సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఇటీవలి కాలంగా పెట్టుబడులకు తమిళనాడు కేంద్రంగా మారిందని, షూ తయారీదారులను ఆకర్షించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల అభివృద్ధిని విస్తృతం చేశామన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగిందని పేర్కొన్నారు.మదురై, శివగంగైతో సహా పలు చోట్ల షూ తయారీ పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం ఎకనామిక్ అసెస్‌మెంట్ సర్వే తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి, విద్యా అభివృద్ధిని నివేదించడం, తమ ప్రభుత్వానికి దక్కిన విజయంగా అభివర్ణించారు.
ఆకస్మిక తనిఖీలు చేయాలి
క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలి
కొత్త కలెక్టర్లకు సీఎం పిలుపు
సచివాలయంలో భేటీ
జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేయాలని, పథకాలు, పనులు, ప్రాజెక్టులు ఏ మేరకు అమలు చేస్తున్నారో అధ్యయనం చేయాలని సూచించారు. గ్రీవెన్స్ క్యాంపు వినతి పత్రాలపై, ముఖ్యమంత్రి సెల్ విజ్ఞప్తులు, ఫిర్యాదులపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు ఇచ్చే ఫిర్యాదులు తక్షణం పరిశీలించడం, విచారించడం ద్వారా పరిష్కార మార్గం చూపించాలని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా ఎస్పీలతో సమన్వయంగా పనిచేయడం, ఎప్పటికప్పుడు సంప్రదింపులతో సమస్యలను అధిగమించే విధంగా ముందుకు సాగాలని, భద్రతా పరంగా చర్యలు విస్తృతంగా తీసుకోవాలని సూచించారు. తాను ప్రతి జిల్లాలోనూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వస్తున్నానని గుర్తుచేస్తూ, ఈ పర్యటన సందర్భంగా తమ జిల్లా కలెక్టర్ చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రజలే తన వద్దకు వచ్చి మెచ్చుకునే విధంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ప్రజలలో ఎల్లప్పుడు ఉండడం ద్వారా ఇది సాధ్యం అవుతుందని, ఆ విధంగా పనితీరు సాగాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. సీఎం అల్పాహారం పథకం, వైద్య పథకాలు, , కలైంజ్ఞర్ మహిళా హక్కు పతకం, పుదుమై పెన్, తమిళ్ పుదల్వన్ వంటి పథకాలను ఎప్పటిప్పుడు పర్యవేక్షిస్తుండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాల కలెక్టర్లు కలెక్టరేట్లకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలని, ప్రజల ప్రతినిధులుగా క్షేత్ర స్థాయిలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు. చివరగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల్లోకి వెళ్లాలని, నిరంతరం ప్రజలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, ప్రభుత్వ రంగ కార్యదర్శి రీటా హరీష్ టక్కర్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేడు తిరుచ్చికి సీఎం
భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వజ్రోత్సవాలు తిరుచ్చి జిల్లా మనప్పారై వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 25 వేల మందికి పైగా స్కౌట్స్ అండ్ గైడ్స్‌బృందాలు ఈ వేడుకకు తరలి వచ్చాయి. రోజూ సాహసకార్యక్రమాలు, విన్యాసాలు, వివిధ పోటీలు ఇక్కడ జరుగుతూ వచ్చాయి. ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరగనున్నది. ఇందులో సీఎం స్టాలిన్ పాల్గొననున్నారు. ఇందు కోసం చైన్నె నుంచి మధ్యాహ్నం తిరుచ్చికి విమానంలో వెళ్తారు. రోడ్డు మార్గంలో మనప్పారై పారిశ్రామిక వాడ మైదానంకు చేరుకుని, అక్కడ జరిగే ముగింపు ఉత్సవంలో సీఎం పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment