కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో తమిళనాడుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇక్కడి ప్రాజెక్టుల గురించి గానీ, నిధుల గురించి గానీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊసెత్త లేదు. తమిళ మహాకవి తిరువళ్లువర్ సూక్తులను వళ్లించడంతోనే సరిపెట్టేశారు. దీంతో ఈ బడ్జెట్‌ను మోసపూరిత బడ్జెట్‌గా అభివర్ణిస్తున్నట్టు సీఎం స్టాలిన్ విమర్శించారు. ఇందులో నిర్మలమ్మ మాటల గారడి తప్ప తమిళనాడు ప్రగతి ఊసెత్తక పోవడం విచారకరమని ప్రధాన ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యాఖ్యానించారు.
సాక్షి, చైన్నె: రాజకీయ కారణాలు.. పార్టీల మధ్య సయోధ్య లేకపోవడం రాష్ట్రానికి శాపంగా మారింది. ఫలితంగా కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడుకు ఈ సారి కూడా రిక్తహస్తాలే మిగిలాయి. వివరాలు.. 2021లో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో తమిళనాడుకు క్రమంగా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడుకు చెందిన వారైనప్పటికీ ఆశించిన మేరకు కొత్త ప్రకటనలు, ప్రాజెక్టులు కేటాయించక పోవడం విమర్శలకు దారి తీస్తూ వస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు వేర్వేరుగా ఢిల్లీ వెళ్లి ఆర్థిక మంత్రితో పాటూ పలువురు కేంద్రమంత్రులను కలిసి నిధులు, ప్రాజెక్టుల కోసం సీఎం స్టాలిన్ తరపున విజ్ఞప్తులు పెడుతూ వచ్చాయి. ఈ పరిస్థితులలో శనివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ దాఖలుపై తమిళనాడు ఎదురుచూపులు పెరిగాయి. కొత్త ప్రాజెక్టుల వస్తాయని, నిధులు సంవృద్ధిగా కేటాయిస్తారన్న ఎదురు చూపులు నెలకొన్నాయి. అయితే తమిళ మహాకవి తిరువళ్లువర్ సూక్తులను వళ్లించడంతో సరి తమిళనాడు ఊసే నిర్మలా సీతారామన్ ఎత్తక పోవడం గమనార్హం. అదే సమయంలో పన్ను శ్లాబ్‌లో మార్పు చేస్తూ రూ. 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం, వ్యవసాయం, వైద్య రంగం, విద్యా రంగానికి పెద్ద పీట వేయడం ఆ రంగాలలోని వారు ఆహ్వానిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలు వంటి అంశాలను , ఎంఎస్‌ఎంఈల బలోపేతం వంటి అంశాలను ఆ రంగానికి చెందిన నిపుణులు అభినందించారు. అయితే, తమిళనాడు కంటూ ప్రత్యేకంగా ఎలాంటి ప్రాజెక్టుల వివరాలను వెల్లడించక పోవడం గమనార్హం. కొత్త ప్రాజెక్టులు లేక పోగా, పాత ప్రాజెక్టులకు నిధులైనా కేటాయించారా? అన్న వివరాలు తేలాల్సి ఉంది.
ఈ ఆర్థిక ప్రకటనపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ.. ఇది మోస పూరిత బడ్జెట్ అని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో మరోమారు తమిళనాడుకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. తమిళనాడు అనే పేరును ఈసారి కూడా కనిపించకుండా, వినిపించకుండా చేశారని మండిపడ్డారు. అనేక డిమాండ్లను తాము కేంద్రం ముందు ఉంచామని, ఇందులో ఒక్కటి కూడా కేంద్రానికి కనిపించ లేదా ? అని ప్రశ్నించారు. వీటిని బడ్జెట్ నివేదికలో పొందు పరచడం ఇష్టం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవేలు – రైల్వే ప్రాజెక్టులు – కోయంబత్తూర్, మధురై మెట్రో రైలు వంటి ప్రాజెక్టులు కనిపించ లేదా.. ఉన్నత విద్యా సంస్థల నివేదిక, ఫైనాన్స్ కమిటీ, నీతి అయోగ్ నివేదికలలో తమిళనాడు కీలక స్థానాన్ని సంపాదించుకుని ఉంటే, అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వకుండా, అడ్డుకట్ట వేయడం సమంజసమేనా? అని ధ్వజమెత్తారు. ఈ ఆర్థిక నివేదికలో మాత్రమే కాదు, అన్నింటా తమిళనాడును ఎందుకు పూర్తిగా విస్మరిస్తున్నారో? సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమిళనాడు పై, భాషపై ఆసక్తి చూపించే వాళ్లు, ఇక్కడి ప్రగతిపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు సైతం నిధుల వాటా తగ్గుముఖం పట్టిందని, ఇది తమిళనాడుకు మరింత ఆర్థిక భారానిన కలిగిస్తున్నట్టు వివరించారు. కేంద్రానికి తమిళనాడు నుంచి అధిక ఆదాయం అన్న వెళ్తోందని, ఇలాంటప్పుడు తమిళనాడుపై మాత్రమే కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడం భావ్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల సంక్షేమం పై కేంద్ర పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, మోసపూరిత నివేదిక ద్వారా బీజేపీ యథావిధిగా ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో, అక్కడ బిజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీకి లబ్దిని మాత్రం కేంద్రం కలిగిస్తున్నదని విమర్శించారు. కాగా, ఈ బడ్జెట్ బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్టుందని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు విమర్శించారు.
బడ్జెట్‌లో తమిళనాడుకు జరిగిన అన్యాయం తీవ్ర వేదనకు గురి చేసిందని, నిరాశను కలిగించిందని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ వ్యాఖ్యానించారు. ఇటీవలే ప్రపంచానికే తమిళనాడు ఇనుప యుగం పరిశోధన నివేదికను ప్రకటించిందని, అంతటి ప్రాముఖ్యతను కలిగిన తమిళనాడును విస్మరించడం సహించబోమన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను మాత్రమే పరిగణించి ,తమిళనాడు వంటి రాష్ట్రాలను విస్మరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమిళనాడుకు కొత్త పథకాలు ప్రకటించి, సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యహరించడం శోచనీయమని విమమర్శించారు. పక్ష పాతం తగదని, తమిళనాడు వంటి ఆయా రాష్ట్రాల ప్రజలను అవమానించే విధంగా నిధుల ఊసెత్తక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటల గారడి తప్పా, మరెమీ లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి విమర్శించారు. తన మాటలతో మాయాజాలం సృష్టించారని, తమిళనాడుకు మళ్లీ మొండి చేయి చూపించారని మండిపడ్డారు. పన్ను శ్లాబ్‌లో మార్పు, రైతు ప్రయోజనం, ఎంఎస్‌ఎంకేలకు పెద్ద పీట వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో తమిళనాడుకు ఏ ఒక్క ప్రాజెక్టును ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై పేర్కొంటూ 144 కోట్లు జనాభా కలిగిన ఈ దేశంలో 15 శాతం మంది పేదరికంతో కొట్టుమిట్లాడుతుంటే, 25 కోట్లమందిని పేదరికం నుంచి బయట పడేసినట్టుగా కేంద్రం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై మరితం చిన్న చూపుతగదు అని మండి పడ్డారు. తమిళనాడుకు మరీ దారుణంగా ఏ ఒక్క పథకాన్ని కేటాయించక పోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్ ఎండమావి అని విమర్శించారు. ఇక, ఈ బడ్జెట్‌ను బీజేపీ నేతలు ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కో – ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొంటూ, అన్ని వర్గాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్‌గా వ్యాఖ్యానించారు. అదే సమయంలో వైద్య రంగంలోని నిపుణులు ఈ బడ్జెట్‌లో క్యాన్సర్‌తో పాటుగా పలు రకాల మందులకు పన్ను మినహాయింపు కల్పించడాన్ని ఆహ్వానించారు.
తమిళనాడుకు మొండిచేయి
తిరువళ్లువర్ ఊసు తప్ప తమిళనాడు ఊసెత్తని కేంద్ర ఆర్థిక మంత్రి
మోసపూరిత బడ్జెట్ అంటూ సీఎం స్టాలిన్ విమర్శ
అంకెల గారడి అన్న పళణి స్వామి
Comments
Please login to add a commentAdd a comment