తమిళసినిమా: ప్రముఖ చిత్రం నిర్మాణ సంస్థ శ్రీ తేనాండాల్ ఫిలిమ్స్ సుదీర్ఘ విరామం తర్వాత నిర్మించిన చిత్రం మిస్టర్ హౌస్ కీపింగ్. ఈ చిత్రం ద్వారా దర్శకుడు పి. వాసు శిష్యుడు అరుణ్ చంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అదేవిధంగా యూట్యూబర్‌గా పాపులర్ అయిన హరి భాస్కర్, బిగ్ బాస్ ఫేమ్ రాయన్, నటి లోస్లియా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు పి.వాసు, చిత్రా లక్ష్మణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ తెనాండాళ్ ఫిలిమ్స్ అధినేత ఎన్ రామస్వామి మాట్లాడుతూ ఈ కథను దర్శకుడు తనకు పలుమార్లు చెప్పారన్నారు. దీంతో కథలు మార్పులు చేర్పులు చేసి చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయినట్లు చెప్పారు. నటుడు హరి భాస్కర్, నటి లోస్లియా, రాయన్ మొదలగు యువ నటీనటులు ఎప్పుడు సాధించాలనే ఉద్వేగం కలిగినవారని పేర్కొన్నారు. అలాంటి వారికి అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా పదిరెట్లు అధికంగా శ్రమిస్తారని తన తండ్రి రామనారాయణన్ నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు. దర్శకుడు వాసు స్కూల్ నుంచి వచ్చిన అరుణ్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. నిర్మాత నితిన్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈతరం యువతను కచ్చితంగా ఆలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు పి వాసు మాట్లాడుతూ తన శిష్యుడు అరుణ్ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు తనతో చెప్పినప్పుడు నిర్మాత ఎవరని అడిగానన్నారు. దీంతో శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ అని చెప్పగానే ఆ సంస్థలో చిత్రం చేసే అవకాశం రావడం గొప్ప విషయం అని, ఇదే నీకు పెద్ద విజయం అని చెప్పానన్నారు. కాగా తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన నడిగన్ చిత్ర రీమేక్‌లో నటుడు విజయ్ నటించాలని ఆశించారన్నారు. అది చాలా మంచి కమర్షియల్ కథాచిత్రమని పేర్కొన్నారు. అయితే నటుడు గౌండమణి, మనోరమ వంటి వారు లేకపోతే ఆ చిత్రాన్ని మళ్లీ చేయలేమని పి. వాసు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment