ప్రజాప్రతినిధులు లేకుండానే గ్రామసభలు
తిరువళ్లూరు : పంచాయతీ అధ్యక్షుల పదవీ కాలం ముగిసిన క్రమంలో సర్పంచ్‌లు లేకుండానే అధికారుల సమక్షంలో గ్రామసభలు జిల్లా వ్యాప్తంగా సాగాయి. ఏటా రిపబ్లిక్ వేడుకల్లో జిల్లాలోని 526 పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శుల నేతృత్వంలో గ్రామసభలు నిర్వహించారు. పూందమల్లి తాలుకా తిరుమణం గ్రామంలో జరిగిన సభలో మంత్రి నాజర్, కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్, ఎమ్మెల్యే కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభం కాగానే ప్రజలకు చర్మ సంబంధిత, కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించి వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పూందమల్లి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను కార్పొరేషన్, మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరుతూ మంత్రి నాజర్‌కు వినతిపత్రం సమర్పించారు. విలీనంపై ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతామని వారు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామాల్లో సమస్యలు, వసతుల కల్పనపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అబివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న సీఎం స్టాలిన్‌కు సహకారం అందించాలని మంత్రి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment