క్లుప్తంగా
కోలాహలంగా
మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: త్యాగాపురంలో నూతనంగా నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం కోలాహలంగా నిర్వహించారు. ఆర్కేపేట యూనియన్ త్యాగాపురం గ్రామంలో రాధ,రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయం నూతనంగా నిర్మించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటూ మహాకుంభాభిషేకం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి నిత్య హామగుండ పూజలు చేపట్టారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం ఉదయం 10 గంటలకు పవిత్ర పుణ్యతీర్ధాల కలచాలు మంగళ వాయిద్యాల నడుమ తరలించి గోపుర కలచంకు పుణ్యతీర్ధాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఇందులో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు.
చెస్ పోటీలతో మేధాశక్తి
వేలూరు: విద్యార్థులు చిన్న వయస్సు నుంచే చెస్ పోటీల్లో కలుసుకోవడం ద్వారా మేధాశక్తి పెరగుతుందని చెస్ కోచ్ రాష్ట్ర కార్యదర్శి ఆనందజ్యోతి అన్నారు. రాయ వేలూరు యోగా చెస్ అసోలియేషన్ ఆధ్వర్యంలో ఏడవ జిల్లా స్థాయి చెస్ పోటీలు జిల్లా కోశాధికారి మనోహరన్ అద్యక్షతన వేలూరులోని ప్రైవేటు కళాశాల ఆవరణంలో నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కలుసుకున్న విద్యార్థులు ఓటమి చెందినా నిరుత్సాహం చెందకుండా పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చాన్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించే విద్యార్థులు రీజనల్ స్థాయిలో నిర్వహించే పాల్గొని అనంతరం రాష్ట్ర స్థాయి పోటీల్లో కలుసుకుంటారన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లతో పాటూ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చెస్ ఆకాడమీ ఆర్గనైజర్ ప్రకాష్, లోక ప్రకాష్, లక్ష్మి, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
మాధవరంలో డీఆర్‌ఏ
ఆస్ట్రా హౌసింగ్ ప్రాజెక్టు
సాక్షి, చైన్నె : మాధవరం స్కైలైన్‌ని పునర్నిర్వచించే విధంగా డీఆర్‌ఏ నిర్మాణ సంస్థ నేతృత్వంలో మోడరన్ లైప్ స్టైల్ బహుళ అంతస్తుల గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ వివరాలను ఆదివారం డీఆర్‌ఏ ఎండీ రంజీత్ రాథోడ్ స్థానికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ 132 యూనిట్లతో 2,3 బీహెచ్‌కే జీవన శైలి గృహాలను అత్యంత సౌకర్యవంతంగా నిర్మించనున్నామని వివరించారు. ప్రశాంతత , శ్రేయస్సు సమ్మేళనాన్ని అందిస్తూ, డీఆర్‌ఏ ఆస్ట్రా పేరుతో జీవనశైలి, సమతుల్యతతో గృహాలను నిర్మించనున్నామన్నారు. మాధవరంలో సబర్బన్ బస్ టెర్మినల్ ఏర్పాటైందని, మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయని గుర్తు చేస్తూ అన్ని రకాలుగా అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండే రీతిలో తమనిర్మాణాలు ఉండబోతున్నాయని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరి దుర్మరణం
తిరువొత్తియూరు: చైన్నె విల్లివాకం సమీపంలో లారీ బైక్ ఢీకొన్న ప్రమాదంల విద్యుత్ ఉద్యోగి, 9వ తరగతి విద్యార్థి మృతి చెందారు. వివరాలు.. చైన్నె, శివారు నగరం మీంజూరు ఊరనం బేడు ప్రాంతానికి చెందిన జ్యోతి (35) విద్యుత్ బోర్డు కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు. ఇతను ఆదివారం ఉదయం అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న తన అక్క కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్న విమల్ (14)తో కలిసి విల్లివాకంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి మోటార్ సైకిల్‌పై వెళ్లాడు. ఉదయం 10 గంటల సమయంలో వల్లలార్ జంక్షన్ వద్ద వస్తుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ హఠాత్తుగా వారి బైకును ఢీకొట్టింది. ఇందులో లారీ చక్రం కింద చిక్కుకున్న జ్యోతి అదేచోట మృతి చెందాడు. తీవ్ర గాయాలైన తొమ్మిదో తరగతి విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై రెడ్ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ తిరువన్నామలైకి చెందిన ప్రశాంత్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment