తిరుత్తణి ఆలయంలో పీపీపీ.. డుండుండుం..
● ఒకేరోజు వంద వివాహాలు
తిరుత్తణి: శుభముహూర్త దినోత్సవం సందర్భంగా తిర్తుతణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం మంగళ వాయిద్యాలు మార్మోగాయి. వివాహాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన బంధువులు, మిత్రులు స్వామి దర్శనానికి వెళ్లడంతో నాలుగు గంటల సమయం వేచివుండి స్వామి దర్శనం పొందారు. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కల్యాణం కోసం 40 రోజులు ముందుగా వధూవరుల రికార్డులు సమర్పించి వివాహానికి అనుమతి పొందడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తై నెలలో ఆదివారం శుభముహూర్త దినం కావడంతో 60 వివాహలకు ఆలయ అధికారులు అనుమతిచ్చారు. అలాగే పట్టణంలోని వివిధ ప్రైవేటు మండపాల్లో 40 వివాహాలు జరిగాయి.
ఒకే రోజు తిరుత్తణి పట్టణంలో వంద వివాహాలతో పట్టణంలో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వివాహాల్లో పాల్గొనేందకు జనం పోటెత్తడంతో పాటు సెలవుదినం సందర్భంగా స్వామిదర్శనంకు భక్తులు రాకతో కొండ ఆలయంలో కోలాహలం చోటుచేసుకుంది. కొండలోని కావడి మండపం, ఆర్‌సీసీ మండపాల్లో వరుసగా వేకువజాము 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు వరుస క్రమంలో వివాహాలు జరిగాయి. ఏకదాటిగా మంగళ వాయిద్యాలు మార్మోగాయి. వధూవరులను ఆశీర్వదించిన బంధువులు, మిత్రులు స్వామిదర్శనంకు ఆసక్తి చూపారు. దీంతో మాడ వీధులు నిండి క్యూలైన్‌లు కిక్కిరిళాయి. నాలుగు గంటల పాటు వేచివుండి కొత్తగా వివాహమైన వధూవరులు, వారి బంధువులు, మిత్రులు స్వామిని దర్శించుకున్నారు. పట్టణంతో పాటు ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ సమస్య పరిష్కరించే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు నిరవధికంగా పోలీసులు ఘాట్‌రోడ్డు వన్‌వేగా మార్చి వాహనాలు కొండ ఆలయం కింద భాగంలోనే పార్కింగ్ చేసేలా మార్పులు చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కరించి భక్తులు నడిచి వెళ్లిస్వామి దర్శనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment