రూ. 5.94 కోట్ల వ్యయంతో తొమ్మిది పీహెచ్‌సీలు
వేలూరు: రాణిపేట జిల్లాలోని వాలాజ, ఆర్కాడు బ్లాకులలో రూ. 5.94 కోట్ల వ్యయంతో తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ అన్నారు. జిల్లాలోని వాలాజలో పీహెచ్‌సీ నిర్మాణం కోసం కలెక్టర్ చంద్రకళ అధ్యక్షతన మంత్రులు, సుబ్రమణియన్, ఆర్ గాంధీలు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రోగులకు తక్కువ ధరకు మందులు విక్రయం చేసేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వెయ్యి మెడికల్ దుకాణాలను త్వరలోనే ప్రారంభించనున్నారని తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన అన్ని ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇప్పటికే 2,553 డాక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని, మరో రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేయడంతో పాటూ మరో రెండు వారాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రిలోని ఖాళీ పోస్టులను ఇప్పటికే గుర్తించడం జరిగిందని వీటిని భర్తీ చేయనున్నామన్నారు. అదే విధంగా అన్ని ఆసుపత్రిలోను రోగులకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచడం జరిగిందని ఆసుపత్రిలో 24 గంటల పాటు రోగులకు చికిత్స అందజేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. అనంతరం పీహెచ్‌సీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరప్పన్, అధికారులు పాల్గొన్నారు.
● మంత్రి సుబ్రమణియన్
Comments
Please login to add a commentAdd a comment