సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లపై మరింత నిఘా పెట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రతి ప్రైవేటు స్కూల్‌ను ఆన్‌లైన్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించే పనిలో ఉంది. ప్రతి ప్రైవేటు పాఠశాల ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా చూడాలని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చారు. అనుమతి పొందిన సెక్షన్లు, స్కూల్‌లో చదివే విద్యార్థుల సంఖ్య, ఎంతమంది ఉపాధ్యాయులు, ఏ సబ్జెక్టుకు ఎవరు టీచర్? వాళ్ళ అర్హతలేంటి? తీసుకునే ఫీజులెంత? ఇలాంటి అంశాలతో పోర్టల్‌ను రూపొందిస్తున్నారు.
ఈ నెలాఖరులోగా ఇది సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించని స్కూళ్లను గుర్తించడం దీనివల్ల సాధ్యమవుతుందని, నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక ఫీజుల వసూలుకు కళ్లెం వేసేందుకు తోడ్పడుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ పోర్టల్ రూపకల్పనపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ప్రైవేటు స్కూళ్ల సమాచారం ఇప్పటివరకు జిల్లా అధికారుల పరిధిలోనే ఉంటోంది.
ఇక మీదట విద్యార్థుల తల్లిదండ్రులూ వివరాలు తెలుసుకులా వెసులుబాటు కలి్పంచనున్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) నివేదికలో రాష్ట్ర పాఠశాల విద్య 31వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ప్రమాణాలు పెంచేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణ అవసరమని అధికారులు భావిస్తున్నారు.
బోధనలో నాణ్యతపై దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 వేల ప్రైవేటు స్కూళ్లున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం వీటిల్లో 1.75 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నిజానికి డీఎడ్‌తో పాటు టెట్ ఉత్తీర్ణులైన వారినే టీచర్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా పాఠశాలల్లో డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) చేసిన వారితోనే బోధన సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అనేక స్కూళ్లల్లో ఎలాంటి అర్హతలు లేని ఉపాధ్యాయులు కూడా బోధిస్తున్నట్టు తేలింది. దీంతో విద్యలో నాణ్యత దెబ్బతింటోందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రైవేటు స్కూళ్లు మాత్రం అన్ని అర్హతలున్న టీచర్లే బోధన చేస్టున్నట్టుగా రికార్డుల్లో పేర్కొంటున్నాయి. అయితే దీనిపై ఇంతకాలం సరైన పర్యవేక్షణ లేకపోవడం పాఠశాల విద్యపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల వివరాలు, వారి అర్హత పత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించారు.
అధిక ఫీజులకు కళ్లెం..
మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఏటా తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. దీన్ని కట్టడి చేయడానికి స్కూళ్ళ వారీగా ఫీజుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించారు. కోవిడ్ తర్వాత ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది.
దాదాపు 40 శాతం మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. స్కూళ్లు సరిగా నడవకపోవడం, ఫీజులు వసూలు కావడం లేదనే సాకుతో వేతనాలు ఇవ్వకపోవడంతో, ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో టీచర్లు ప్రైవేటు స్కూళ్లల్లో పనిచేయడం మానేశారు. దీంతో అర్హతలేని వారితో బోధన చేయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే పోర్టల్ తెస్తున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
నాణ్యత పెరుగుతుంది
ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్ళ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రత్యేక పోర్టల్ తేవడం వల్ల వాస్తవికత తెలుస్తుంది. ఫలితంగా పాఠశాలల్లో నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని మేం ఎన్నోసార్లు విద్యాశాఖ దృష్టికి తెచ్చాం. ఇప్పటికైనా అడుగులు పడటం సంతోషం.
– పి.రాజాభానుచంద్ర ప్రకాశ్ (అధ్యక్షుడు, రాష్ట్ర హెచ్‌ఎంల సంఘం)
Comments
Please login to add a commentAdd a comment