‘నాకో మంచి పోర్ట్ ఫోలియో చేసిపెట్టండి’ అంటూ అభ్యర్థిస్తూ ఫొటో గ్రాఫర్లను కలిసేవారిలో సాధారణంగా గ్లామర్ రంగంలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహిక యువతే ఎక్కువ.. అయితే ప్రపంచంలోని అందరి రూట్లనూ అన్ని సంప్రదాయాలనూ మార్చేసిన కరోనా దెబ్బకి ఇదీ మారిపోయింది. దీంతో ఇప్పటికే గ్లామర్ రంగంలో తమకంటూ ఒక ప్లేస్ ఉన్నవారు సైతం ఫిర్ ఏక్‌బార్ అంటూ ఫొటో షూట్స్ కోసం క్యూ కడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: ‘అవకాశాలు రావడం మొదలయ్యాక సదరు అవకాశాలు ఇచ్చిన వారి కోసం పాత్రలకు అనుగుణంగా ఫొటో షూట్స్ గ్లామర్ రంగంలో సర్వసాధారణం. అయితే ఇప్పుడు దాదాపు ప్రతి అప్‌కమింగ్ నటి/మోడల్ మళ్లీ తమని తాము మొదటి నుంచీ పరిచయం చేసుకోవాల్సి వస్తోంది. అందుకే మరోసారి పోర్ట్ ఫోలియో ప్లీజ్ అంటున్నారు’ అని చెప్పారు బంజారాహిల్స్‌లో స్టూడియో నిర్వహిస్తున్న ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల.
ఒత్తిడితో అధిక బరువు..
⇔ అనూహ్యంగా వచ్చిపడిన మహమ్మారి దెబ్బకు అందాల తారల రొటీన్ మొత్తం తలకిందులైంది. మొదట్లో ఇది ఒక రోజో, ఒక వారమో ఉండిపోయేది అనుకుని తేలిగ్గా తీసుకున్న కొందరు.. రోజులు, నెలల తరబడి లాక్‌డౌన్ కొనసాగడంతో జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు.
⇔ నాలుగ్గోడల మధ్య ఉండటమనే అలవాటు లేని వారు, కొత్తగా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్నవారు అంతలోనే ఈ దెబ్బ తగలడంతో ఒత్తిడికి లోనై, ఈటింగ్ డిజార్డర్‌కు గురై బరువు పెరిగిపోయారు.
⇔ యోగా వంటివి చేసినప్పటికీ జిమ్స్‌లో తప్పనిసరిగా చేయాల్సిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి బాడీ టోనింగ్ వ్యాయామాలు చేయకపోవడంతో మరికొందరిలో ఆ మేరకు కండరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
‘రూపు’దిద్దుకోండి..
నగరంలో గ్లామర్ రంగం ఇప్పడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంది. వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్స్, యాడ్ షూట్స్.. నిదానంగానే అయినా పుంజుకుంటున్నాయి. దీంతో తారలు మళ్లీ తమ ‘పాత్ర’లు పోషించడం కోసం సిద్ధమవుతున్నారు.
⇔ సిద్ధమవుతున్న వారు.. తమలో ఎలాంటి మార్పులూ రాలేదని రుజువు చేసుకోవాల్సిందిగా నిర్మాతలు, రూపకర్తల నుంచి ఆదేశాలు అందుతున్నాయి. దీంతో వీరంతా.. జిమ్‌లలో కసరత్తుల టైమ్ పెంచడంతో పాటు సరికొత్త పోర్ట్ ఫోలియోలను రూపొందించమని ప్రముఖ ఫొటోగ్రాఫర్లను కలుస్తున్నారు.
⇔ విచిత్రం ఏమిటంటే.. తమను తాము పరిచయం చేసుకోవడానికి మంచి ఆల్బమ్ రూపొందించమని అడగాల్సిన ఔత్సాహికులు.. కోవిడ్ పుణ్యమాని ఇప్పుడు కొత్త అవకాశాలు దక్కించుకునే పరిస్థితి లేకపోవడం పోర్ట్ ఫోలియోలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ చిత్రమైన పరిస్థితులు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి.
కొలత.. కలత..
⇔ నిత్యం తీసుకుంటున్న కార్బొహైడ్రేట్లను, కేలరీలను కొలుచుకుంటూ ఆ ప్రకారం ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాన్ని రోజువారీ పనుల్లో భాగంగా మార్చడం వగైరాలు గ్లామర్ రంగంలో పనిచేస్తున్న వారికి మరీ ముఖ్యంగా యువతులకు ఎంత ముఖ్యమో తెలియంది కాదు.
⇔ రూపురేఖలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే రంగం కాబట్టి.. అవకాశాలు అందించడంలో ఫిజికల్ ఫిట్‌నెస్, మెజర్‌మెంట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే అంగుళాలతో సహా లెక్కించుకుని, శరీరపు కొలతల్లో ఎటువంటి తీవ్రమైన మార్పు చేర్పులూ చోటు చేసుకోకుండా కేర్ తీసుకుంటారు గ్లామర్ తారలు.
పోర్ట్‌ఫోలియో తప్పదు..
కొత్తగా అవకాశాలు అందుకోవాలనుకున్నవారు మాత్రమే కాదు లాక్‌డౌన్ తర్వాత అందరూ కొత్త తారలే అయ్యారు. ఫ్రెష్ ఫొటోషూట్ ద్వారా మాత్రమే వారు తమ లుక్ మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలుగుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత నేను చేసిన వర్క్స్‌లో తారల పోర్ట్‌ఫోలియోలే ఎక్కువగా ఉన్నాయి. – షరీఫ్ నంద్యాల, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్
Comments
Please login to add a commentAdd a comment