ఆదాయాన్ని పెంచండి! | Bhatti: Explore ways to augment state revenues | Sakshi
Sakshi News home page

ఆదాయాన్ని పెంచండి!

Published Sat, Jun 8 2024 5:04 AM | Last Updated on Sat, Jun 8 2024 5:04 AM

Bhatti: Explore ways to augment state revenues

ఆ మార్గాలపై దృష్టి పెట్టండి

కీలక శాఖలకు డిప్యూటీ సీఎం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే శాఖల ఉన్నతాధికారులు, ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, స్టాంపులు రిజి్రస్టేషన్లు, భూగర్భ గనులు తదితర శాఖలు ఈ అంశంపై ఫోకస్‌ పెట్టాలని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాయంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగా మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించిన తరువాత ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవడానికి యంత్రాంగం సిద్ధం కావాలని సూచించారు. ఎటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్‌ అంచనాలను అందుకోవాలన్నారు. ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంలో పురోగతిని తరచూ సమావేశాల ద్వారా సమీక్షించుకోవాలని సూచించారు.  

తక్కువ వడ్డీ సంస్థలకు ఆర్టీసీ రుణాలు బదలాయించాలి 
ఆరీ్టసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకొని, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయించాలని, ఆదాయం పెంచుకునే మార్గాలు వెతకాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇటీవల సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిన విషయాన్ని ఆరీ్టసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు.  

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి
ఎల్‌ఆర్‌ఎస్‌ కింద చేసుకున్న దరఖాస్తులు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. హౌసింగ్‌ బోర్డు, రాజీవ్‌ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇళ్లు, వచి్చన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారీ చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నట్టు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేటు ఆసుపత్రిలోనూ ఆయా చికిత్సలు అందించేలా వారితో చర్చించి ఒప్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్‌ బుద్ధ ప్రసాద్, ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement