సందర్భాన్ని బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు
గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారు
మీడియాతో సీఎం రేవంత్ చిట్‌చాట్
అక్కల మాటలు నమ్మి మోసపోయా అని కేటీఆర్‌కు చెప్పా
నేను సభలో ఒక్క మాట కూడా అసభ్యంగా మాట్లాడలేదు
సాక్షి, హైదరాబాద్: ‘బహిష్కరణలు, సస్పెన్షన్లు, మార్షల్స్ అవసరం లేకుండా సభ నడపాలనేది మా ప్రభుత్వ ఆలోచన. కానీ అలాంటి అవసరం, సందర్భం వస్తే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావొచ్చు. ఏ నిర్ణయమైనా సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుంది. శాసనసభలో నేను ఒక్కమాట కూడా అసభ్యంగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన దాంట్లో అన్ పార్లమెంటరీ పదం లేదు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభ వాయిదా అనంతరం ఆయన తన చాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సభలో చేసిన వ్యాఖ్యలు, ఇతర అంశాలపై స్పందించారు.
నేను వాళ్ల పేర్లు ప్రస్తావించలేదు
‘మోసానికి పర్యాయపదం సబిత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని చెప్పిన సబిత అక్క నాకు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారింది. నా ఎన్నికల బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను నామినేషన్ వేసేటప్పటికే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం 2018 ఎన్నికల్లో ప్రచారానికి పోతే నా మీద కౌడిపల్లి, నర్సాపూర్‌లో రెండు కేసులు పెట్టారు. అధికార పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ పదవి తీసుకున్న సునీత తాను ఎమ్మెల్యే అయినా తన ప్రచారం కోసం వెళ్లిన తమ్ముడి మీద కేసులు తీయించలేదు. ఈ నేపథ్యంలోనే అక్కల మాటలు నమ్మి నేను మోసపోయాను అని కేటీఆర్‌కు చెప్పా. నేను వాళ్ల పేర్లు ప్రస్తావించలేదు. సబిత వ్యక్తిగత విషయాలను మాట్లాడినందుకే, నేను మిగతాది పూర్తి చేశా..’ అని సీఎం చెప్పారు.
కేసీఆర్‌ను ఫ్లోర్‌లీడర్‌గా తొలగించాలి
‘సబితక్కకు అవమానం, అన్యాయం జరిగి అవేదన చెందితే కేసీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీకి ఎందుకు డుమ్మా కొట్టారు. సభలోకి వచ్చి సబితక్కకు అండగా నిలబడకుండా, పార్టీ సభ్యులను పట్టించుకోకుండా కేసీఆర్ ఎందుకు పత్తా లేకుండా పోయారు. సభలో మాట్లాడేందుకు కేటీఆర్, హరీశ్‌రావు చాలు అనుకుంటే, కేసీఆర్‌ను ఫ్లోర్‌లీడర్ పదవి నుంచి తొలగించాలి. కేసీఆర్‌కు రాష్ట్రం పట్ల బాధ్యత, పట్టింపు లేదు. కేసీఆర్‌కు అధికారం తప్ప ప్రజలను పట్టించుకోవాలనే మంచి ఆలోచన లేదు..’ అని రేవంత్ విమర్శించారు.
విపక్ష సభ్యులకే ఎక్కువ సమయం
ఒక రోజు 17 గంటలపైనే సభ జరగడాన్ని బట్టి చూస్తే వారం రోజులకు పైగా సభ జరిగినట్లే. ఎన్ని రోజులు సమావేశాలు జరిగాయనే దానికంటే ఎన్ని గంటలు జరిగిందనేదే ముఖ్యం. గడిచిన పదేళ్లతో పోలిస్తే అసెంబ్లీని ప్రజాస్వామికంగా నడుపుతున్నాం. సభలో విపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చాం. బీఆర్‌ఎస్ తరపున కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ముగ్గురు కలిసి ఆరు గంటల సేపు మాట్లాడారు. నాతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. ముగ్గురం కలిసినా అంతసేపు మాట్లాడలేదు’ అని సీఎం చెప్పారు.
కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు
గద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే వార్తపై స్పందిస్తూ.. ‘టీ తాగేందుకు కలుసుకోవటం, రాజకీయాలకు, పార్టీల్లో చేరటానికి సంబంధం లేదు. ఇటీవల ఎనిమిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నా చాంబర్‌కు వచ్చి టీ తాగారు. అంతమాత్రాన వారు మా పార్టీలో చేరినట్లా..?’ అని రేవంత్ ప్రశ్నించారు.
ప్రజాస్వామికంగా అసెంబ్లీ సమావేశాలు
‘గతంలో బీఆర్‌ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాలు రద్దు చేశారు. నన్ను కూడా ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేయడంతో నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని హైకోర్టులో పిటిషన్ వేశా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభలోనూ ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు పూర్తి ప్రజాస్వామికంగా, బాధ్యతగా జరిగాయి. చర్చను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినా మేము బాధ్యతగా వ్యవహరించాం. ఈసారి బడ్జెట్ సమావేశాలు తక్కువ రోజులు జరిగినా బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై అందరికీ మాట్లాడే అవకాశం దొరకడంతో వీలైనంత చర్చ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment