మా ప్రభుత్వ ప్రాథమ్యాలు ఇవే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ కల్పన, మెరుగైన విద్య కోసం విశ్వవిద్యాలయాల అభివృద్ధి, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం కేవలం పదవులు, ఫామ్‌హౌస్‌లు, బంగళాలు, ఆస్తుల జమ లాంటి ప్రాధాన్యతలతో పదేళ్లు అధికారం చలాయించిందని ఆయన ఆరోపించారు.
తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటోందని.. తనతోపాటు మంత్రులు, అధికారులను ఎవరైనా కలిసి ప్రశ్నించే వెసులుబాటు ఉందన్నారు. రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.
స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలతో..
‘గత ప్రభుత్వం పదేళ్లలో పరీక్షలు నిర్వహించకుండా తీవ్ర జాప్యం చేస్తే మేం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు వేగవంతం చేశాం. రాష్ట్రంలో సర్టిఫికెట్ కోర్సులకే విద్య పరిమితమైంది. చదువుకు తగిన శిక్షణ లేకపోవడంతో యువత ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో వర్సిటీ పాలకమండలిని ఏర్పాటు చేశాం.
వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను ఎంపిక చేశాం. ఈ ఏడాది 2 వేల మందికి, వచ్చే ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నాం. ఇటీవల ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని నిర్ణయించాం. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌కు పెద్ద సంఖ్యలో పథకాలు వచ్చేలా క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’అని రేవంత్ వివరించారు.
100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు రానున్న పది రోజుల్లో వైస్ చాన్స్‌లర్లను నియమించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ‘వీసీల నియామకం పూర్తి కాగానే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. గత ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంది.
కానీ కనీస వసతుల్లేక పౌల్ట్రీ షెడ్‌లో కోళ్ల మాదిరిగా వాటిని తయారు చేసింది. కానీ మేము మెరుగైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నాం. ఒక్కో క్యాంపస్‌ను 20 నుంచి 25 ఎకరాలతో ఏర్పాటు చేస్తాం’అని రేవంత్ తెలిపారు.
లక్ష్యంపైనే దృష్టిపెట్టండి..
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించి మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. కొంతకాలం ఇంటి సమస్యలను, ఇతర అంశాలను పక్కనపెట్టి కేవలం సివిల్ సరీ్వసుకు ఎంపిక కావాలనే లక్ష్యాన్నే గుర్తుంచుకోవాలని సూచించారు.
మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు అందించిన రూ. లక్ష ఆర్థిక సాయం పెద్ద మొత్తం కానప్పటికీ ప్రభుత్వం విద్యార్థుల వెంట ఉందనే భావన కలిగించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైతే మరో రూ. లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ మంది సివిల్స్ ఉద్యోగాలు సాధించి రాష్ట్ర పరపతిని పెంచాలని కోరారు.
మానవవనరుల వృద్ధి కోసమే స్కిల్స్ వర్సిటీ: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో మానవవనరులను మెరుగపర్చేందుకే స్కిల్స్‌యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మేధోసంపత్తిని ప్రోత్సహించి దేశానికి ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. గురుకులాలల్లో మౌలికవసతుల కల్పనకు గతేడాది రూ. 4 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం రూ. 5 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించిందని గుర్తుచేశారు.
మూసివేతకు చేరువైన 63 ఐటీఐలను తమ ప్రభుత్వం ఏటీసీలుగా అభివృద్ధి చేసిందని భట్టి వివరించారు. అనంతరం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment