హృదయ విదారకం: ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ.. | Covid Deaths in Telangana: Coronavirus Wiping Out Families, Heartbreaking Tragedies | Sakshi
Sakshi News home page

హృదయ విదారకం: ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ..

Published Wed, Jun 2 2021 7:41 PM | Last Updated on Wed, Jun 2 2021 9:25 PM

Covid Deaths in Telangana: Coronavirus Wiping Out Families, Heartbreaking Tragedies - Sakshi

కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గుర్ని బలి తీసుకుంటోంది. ఒకరు చనిపోయిన వార్త మరొకరికి తెలియకముందే మహమ్మారి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు.. ఇలా అనేక కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు అయినవాళ్లు, ఆప్తులు మరణిస్తుండటంతో ఎంతోమంది వృద్ధులు, మరెంతో మంది పిల్లలు అనాథలుగా మారుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ.. 
 – సాక్షి ప్రతినిధి, నల్లగొండ 

మూడురోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి
నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు వెంపటి వీరాంజనేయులు (64) ఆయన చిన్న కుమారుడు రాంబాబు (36) మూడు రోజుల వ్యవధిలోనే కరోనాతో చనిపోయారు. వీరాంజనేయులు తన ఇద్దరు కుమారులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. తొలుత వీరాంజనేయులు పెద్ద కుమారుడు రాఘవులకు కరోనా రావడంతో చికిత్స తీసుకుం టున్న సమయంలోనే తండ్రి వీరాంజనేయులు, ఆయన చిన్న కుమారుడు రాంబాబు కూడా కరోనా బారినపడ్డారు.

రాంబాబు మిర్యాలగూడలోని ఓ  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 8వ తేదీన మృతి చెందాడు. కాగా అప్పటికే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరాంజనేయులు మే 11న మృతి చెందడంతో ఉమ్మడి కుటుంబంలో విషాదం అలుముకుంది. రాంబాబుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రాఘవులు కోలుకున్నాడు.

కొడుకు లేడన్న బాధతో తండ్రి..
కరోనా కోరలకు చిక్కిన ఓ కుటుంబం చికిత్స కోసం రూ.15 లక్షల పైచిలుకు ఖర్చు చేసినా ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఆ కుటుంబంలో తండ్రీ తనయులు ఇద్దరినీ కరోనా మింగేసింది. ఇద్దరు మగవాళ్లను కోల్పోయిన కుటుంబంలో మిగిలిన ఇద్దరు ఆడవాళ్లు.. తమవారి చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఊళ్లో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మకానికి పెట్టారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన తన్నీరు భిక్షం (55) కుటుంబం దీనావస్థ ఇది. భిక్షం దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ పెళ్లిళ్లుఅయ్యాయి. వీరిలో చిన్న కుమారుడు తన్నీరు విజయ్‌ (26) బతుకుదెరువు కోసం కొన్ని రోజులు హైదరాబాద్‌లో ఉండి ప్రైవేట్‌ ఉద్యోగం చేశాడు.

గత ఏడాది లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత పనులు దొరకక నాగార్జునసాగర్‌కు మకాం మార్చి.. ఇంటర్నెట్‌ కేఫ్‌లో పని చేస్తున్నాడు. ఆయన కరోనా బారిన పడడంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ నెల 7వ తేదీన మృతి చెందాడు. అప్పటికే విజయ్‌ తల్లిదండ్రులు ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ రాగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందారు. తమ కుమారుడు చనిపోయాడన్న విషయం తెలియగానే హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్న తండ్రి భిక్షం సొమ్మసిల్లి పడిపోయాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 12వ తేదీన మృతి చెందాడు. 

యోగా గురూజీ దంపతులను.. మింగిన కరోనా 
చిత్తలూరి నర్సయ్య సూర్యాపేట జిల్లాలో యోగా గురూజీగా ప్రజలకు చిరపరిచితుడు. కొన్నేళ్లుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చి అనేక మందికి ఆరోగ్య నియమాలు.. యోగాసనాలు నేర్పించాడు. అలాంటి యోగా గురువును, ఆయన భార్యను కరోనా కాటేసింది. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య (60) రిటైర్డ్‌ వార్డెన్‌. భార్య యాదమ్మ(55)తో పాటు కొన్నేళ్లుగా కోదాడ పట్టణంలో ఉంటున్నారు. వీరిద్దరూ మే  మొదటి వారంలో కరోనా బారిన పడ్డారు. నాలుగైదు రోజులు ఇంట్లోనే వైద్యం తీసుకున్నారు.

అయిదు రోజుల తర్వాత నర్సయ్యకు దగ్గు ఎక్కువ కావడంతో హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. అప్పటికే కొద్దిపాటి లక్షణాలు ఉన్న భార్య యాదమ్మను కూడా అదే కారులో తీసుకెళ్లారు. దీంతో ఆమెకు కూడా వైరస్‌ సోకింది. ఇరువురు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతుండగా యాదమ్మకు బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో మే 9న చనిపోయింది. భార్య మరణించిన విషయం నర్సయ్యకు తెలియనివ్వలేదు. తర్వాత ఆయనకు కూడా బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం దక్కలేదు.

కరోనాతో కొడుకు.. మనోవేదనతో తల్లి 
ఎదిగిన కొడుకు తనకు ఆసరా ఆవుతాడని కలలు కన్న ఆ కన్నతల్లి.. తన కళ్ల ముందే అతను కరోనా బారిన పడి విలవిల్లాడుతుంటే తల్లడిల్లిపోయింది. మంచి ఆస్పత్రిలో చేర్పించి కొడుకును బతికించుకో వాలనుకుంది. కానీ మాయదారి కరోనా అతన్ని కాటేసింది. ఆ మనోవేదనను తట్టుకోలేక పోయిన ఆ తల్లి రెండ్రోజుల క్రితం గుండాగి చనిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. మండల కేంద్రానికి చెందిన కోట లక్ష్యయ్య, ఎల్లమ్మ(60) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. పిల్లల చిన్నతనంలోనే లక్ష్మయ్య చనిపోవడంతో... ఎల్లమ్మ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేసింది.. ఎల్లమ్మ కొడుకు కోట కుమార్‌ ఊళ్లోనే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసారాగా నిలిచాడు.

గ్రామంలో మేస్త్రీ పనులు చేసుకుంటూనే.. చదువుపై ఆసక్తితో మరో వైపు చదువుకుని డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదివి కుటుంబ పేదరికాన్ని జయించాలని కలలు కనేవాడు. అయితే, ఏప్రిల్‌ 19 తేదీన కుమార్‌ (26)కు కరోనా సోకింది. ఇంట్లో ఉండి వైద్యులు చెప్పిన ప్రకారం మందులు వాడుతుండ గానే 20వ తేదీ సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.

హైదరాబాద్‌ తీసుకువెళ్లి పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేర్పించడానికి ప్రయత్నం చేసినా.. ఎక్కడా బెడ్లు దొరకలేదు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గాంధీకి తీసుకువెళ్లారు. అంబులెన్స్‌ నుంచి తీసుకువెళ్లి బెడ్‌మీద పడుకోబెట్టగానే అతను ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు చనిపోయిన వార్త తెలిసినప్పటి నుండి తల్లి ఎల్లమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ బాధలోనే గుండె ఆగి అదే నెల 23న మృతిచెందింది. 

ఒకే ఇంట్లో ముగ్గురు మృతి.. 
ఒకే ఇంట్లో తొమ్మిది రోజుల వ్యవధిలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లికి చెందిన తండ్రి దుంపల లక్ష్మీనారాయణరెడ్డి (75) మే 17న కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందారు. 24న పెద్ద కుమారుడు గౌతంకుమార్‌రెడ్డి (40), 25న పెద్దనాన్న, మాజీ సర్పంచ్‌ సత్యారెడ్డి (80) మృతి చెందారు.

సత్యారెడ్డికి రూ.3 లక్షలు, లక్ష్మీనారాయణరెడ్డికి రూ.50 వేలు ఖర్చు పెట్టినా ప్రయోజనం దక్కలేదు. గౌతంకుమార్‌రెడ్డికి ఏకంగా రూ.11 లక్షలు వెచ్చించినా చివరి చూపు చూసుకోలేని పరిస్థితిలో హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది ఉండగా ఐదుగురికి కరోనా సోకింది. వీరిలో ముగ్గురు చనిపోయారు. 

రోజుల వ్యవధిలోనే తల్లీ కొడుకు..
నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి డివిజన్‌ పరిధి లోని వంగూర్‌కు చెందిన గంధం సురేష్‌ 15 సంవత్సరాల క్రితం కల్వకుర్తికి వచ్చి కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. మే మొదటి వారంలో సురేష్‌తో పాటు ఆయన తల్లి పార్వతమ్మ, భార్య ఇద్దరు కుమారులకు కరోనా సోకింది. అందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. పార్వతమ్మ, సురేష్‌ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న పార్వతమ్మ మే 24న తుదిశ్వాస విడిచింది. 27వ తేదీన సురేష్‌ కూడా మరణించాడు. బంధువులు రూ.18 లక్షలు ఖర్చు చేసినా వారి ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించే సురేష్‌ అకాల మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement