సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న తమ్మినేని, వీరయ్య, జూలకంటి తదితరులు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో నిర్మించాలని, ధరణి పోర్టల్‌ను సవరించి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, సుప్రీం తీర్పు నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీపీఎం నేతలు కోరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, టి.జ్యోతి, పి.సుదర్శన్, నర్సింహారావు, జాన్‌వెస్లీ కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పేద రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులకు 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. తొమ్మిదేళ్లలో వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల జీవో సవరించలేదని, రోజు కూలీ రూ.600 ఉండేలా జీవోను సవరించాలని సూచించారు. అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వివిధ ఉద్యమాల సందర్బంగా ప్రజలు, కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలన్నారు. రాష్ట్రంలో సీలింగ్, మిగులు తదితర సాగుకు ఉపయోగపడే భూములను భూమిలేని పేదలకు పంచాలన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, ఖాళీ పోస్టులు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. చేతి వృత్తుల సంక్షేమ పథకాల్లో లోపాలను సవరించి, అవినీతిని అరికట్టాలని సీపీఎం నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment