అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని తీసుకెళ్తున్న తల్లి, భార్య
బూర్గంపాడు: అర్ధరాత్రి.. అటవీప్రాంతంలో జోరువాన.. అప్పుడే మరమ్మతుకు గురైన అంబులెన్స్.. అందులో కరోనాతో మరణించిన యువకుడి మృతదేహంతో పాటు అతడి తల్లి, భార్య.. కరోనా మరణం కావడంతో సాయం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి.. ఈ ఘటన బూర్గంపాడు మండలంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కరకగూడెం మండలం అనంతారం గ్రామానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్‌రోడ్ వద్ద గల అటవీ ప్రాంతంలో ఆ వాహనం రిపేర్‌కు వచ్చింది. చాలాసేపు ప్రయత్నించిన డ్రైవర్.. ఇక ఆ వాహనం కదలదని చెప్పాడు. దీంతో మృతుడి తల్లి, భార్య రోదిస్తూ నాలుగు గంటల పాటు ఎంతో మందిని సాయం కోరారు. అయితే కరోనాతో మృతి చెందాడనే భయంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరకు బూర్గంపాడు పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు గోనెల నానికి విషయం తెలియగా, ఆయన అక్కడికి చేరుకుని, టాటా ఏస్ వాహనాన్ని ఏర్పాటు చేయించారు. దీంతో అర్ధరాత్రి ఆ వాహనంలో ఎక్కించుకుని, ఊరి శివారులో ఓ బంధువు సాయంతో జోరువాన కురుస్తుండగానే ఖననం చేశారు. కరోనా మహమ్మారితో మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయని, ఇలాంటి దుస్థితి ఎవరికీ రావద్దని మృతుడి తల్లి, భార్య విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment