టీడీఆర్‌లపై ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం
శివబాలకృష్ణకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి పరిశీలన లేకుండానే టీడీఆర్ సర్టిఫికెట్‌ల జారీలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన శంకర్‌పల్లి జోన్ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి బీవీ.కృష్ణకుమార్‌ను హెచ్‌ఎండీఏ కమిషనర్ దానకిషోర్ బుధవారం సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఉదంతంపై సంబంధిత ప్లానింగ్ అధికారులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నగరానికి పడమటి వైపున శంకర్‌పల్లి జోన్‌లో ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి.
అనేక చోట్ల నిబంధనలను విరుద్ధంగా కొనసాగిన ఈ నిర్మాణాల్లో కృష్ణకుమార్ ప్రమేయం ఉన్నట్టు మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఈయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో కబ్జారాయుళ్లు, అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి కృష్ణకుమార్ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
♦ గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలో టీడీఆర్‌లపైన వచ్చిన దరఖా స్తులను పరిశీలించకుండానే ఉన్నతా«ధికారులను తప్పుదోవ పట్టించినట్టుగా తాజాగా రుజువు కావడంతో కమిషనర్ ఆయన్ను సస్పెండ్ చేశారు.
♦ పుప్పాలగూడలోని 330 నుంచి 332 వరకు సర్వేనంబర్లలో తమకు ఉన్న 11,698 గజాల్లో 100 ఫీట్ల రోడ్డుకు భూమిని గిఫ్ట్‌డీడ్ కింద గ్రా మపంచాయతీకి రిజిస్టర్ చేసినట్టు శ్రావణ్‌కుమా ర్‌తో పాటు, మరికొందరు తెలిపారు. ఈ మేరకు వారు టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
♦పుప్పాలగూడ గ్రామంలోనే వెంకటరమణ, మరికొందరు 314 నుంచి 317 వరకు సర్వేనంబర్లలో ఉన్న 22,046 గజాల్లో మాస్టర్‌ప్లా¯న్ కింద 100 ఫీట్ రోడ్డులో భూమి పోయిందంటూ టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
♦టీడీఆర్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కృష్ణకుమార్ తన పై అధికారులను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుతం ఈ ఒకటిరెండు ఉదంతాలే బయటకు వచ్చినా, ఇంకా వెలుగులోకి రాని అక్రమాలు పెద్దఎత్తునే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న సమయంలోనే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన అమెరికాకు వెళ్లడంతో ఏసీబీ దాడుల నుంచి తప్పించుకున్నాడని అప్పట్లో హెచ్‌ఎండీఏ వర్గాలు చర్చించుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment