
ఖైరతాబాద్(హైదరాబాద్): ప్రతియేటా వివిధరూపాల్లో కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం శ్రీ దశ మహావిద్యాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ ప్రతిష్ఠాపన 69వ సంవత్సరం సందర్భంగా మహాగణపతి 63 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పులో ఉండే మహాగణపతి పక్కనే కుడివైపు వరాహాదేవి, ఎడమవైపు సరస్వతిమాత విగ్రహాలు పది అడుగుల ఎత్తు ఉండగా, మహాగణపతి 63 అడుగుల ఎత్తులో నాగశేషుపై నిలబడి ఉండే ఆకారంలో తలపై ఏడు పడగలు, 10 చేతులు ఉంటాయి.
మహాగణపతి పక్కన కుడివైపు 18 అడుగుల ఎత్తులో లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలు ఉంటాయి. శ్రీ దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేయడం ప్రత్యేకతగా ఉందని దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ తెలిపారు. అమ్మవారి ఉపాసనలో దశ మహావిద్యలు అధిక ప్రాధాన్యత కలిగినవనీ, విద్యకు గణపతి అనుగ్రహం కావాల్సి ఉన్నందున దశ మహావిద్యాగణపతిగా నామకరణం చేసినట్లు
తెలిపారు.