సాక్షి, హైదరాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికోసం జనాహార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాలు ప్రధాన రైల్వేస్టేషన్లలో స్టాళ్లకే పరిమితమయ్యాయి. సాధారణ బోగీల్లో ప్రయాణించేవారి భోజన ఇబ్బందులు తొలగించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనరల్ బోగీలు ఆగేచోటనే ఈ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, గుంతకల్, రేణిగుంట స్టేషన్‌ల పరిధిలోనూ ఈ సేవలు అమలవుతున్నాయి.
దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్‌లలో ఈ తరహా సదుపాయం ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివిడతగా దక్షిణమధ్య రైల్వేలో మొదట నాలుగుస్టేషన్లలో జనాహార్ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. జనరల్ బోగీ ప్రయాణికులు మాత్రం తమకు ఆహారం కావాలంటే ట్రైన్ దిగి స్టేషన్‌లో అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల నుంచి ఆహారం తెచ్చుకోవాలి. ఈ ఇబ్బందులను తొలగించేందుకే జనరల్ బోగీల వద్దకే జనాహార్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం
అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో తయారు చేసిన శుభ్రమైన ఆహారపదార్థాలను ప్రయాణికులకు అందజేస్తారు.
- రూ.20కే ఏడు పూరీలు, కర్రీ ఇస్తారు. ఇది 250 గ్రాముల వరకు ఉంటుంది. దీనిని ఐఆర్‌సీటీసీ ఎకానమీ మీల్‌గా పేర్కొంది.
- కాంబో మీల్ రూ.50కే అందజేస్తారు. ఇందులో 350 గ్రాముల వరకు అన్నం, ఒక కర్రీతోపాటు పప్పు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలను అందజేస్తున్నారు.
- ప్రయాణికులు డిజిటల్ రూపంలో చెల్లించే సదుపాయం ఉంది.
దశలవారీగా విస్తరణ
దశలవారీగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు, కాకినాడ, వరంగల్, కాజీపేట్ తదితర స్టేషన్‌లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం తక్కువ ధరలోనే లభిస్తుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ తెలిపారు.
ప్లేట్ ఇడ్లీ రూ.1,200
గోల్డ్ ఇడ్లీని అమ్ముతున్న హైదరాబాద్ కేఫ్
బంజారాహిల్స్(హైదరాబాద్): గోల్డెన్ ఇడ్లీ.. నగరంలో అందుబాటులోకి వచ్చిన కొత్త డిష్ ఇది. ప్లేట్ ఇడ్లీ ధర రూ.1200..అందుకే ఆ ఇడ్లీ బంగారమే అనడంతో అతిశయోక్తి లేదు. తినడానికి కొందరు..చూడడానికి మరికొందరు ఇలా భారీ సంఖ్యలో ఆ హోటల్‌కు జనాలు బారులుతీరుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.3 నుంచి శ్రీనగర్‌కాలనీకి వెళ్లే రోడ్డులో కర్ణాటక బ్యాంక్ ఎదురుగా రాఘవేంద్ర రెసిడెన్సీలో ఏర్పాటుచేసిన కృష్ణ ఇడ్లీ కేఫ్‌నకు తెల్లవారుజామునుంచే ఫుడ్డీలు చేరుకుంటున్నారు.
బంగారు పూత పూసిన ఇడ్లీని గులాబీ రేకులతో కనువిందు చేసే రీతిలో సర్వ్ చేస్తున్నారు. ఒక ప్లేట్‌కు రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ గోల్డ్ ఇడ్లీలే కాకుండా బంగారు దోశ, గులాబిజామ్ బజ్జీ, మలాయి కోవా వంటి 100కిపైగా ఫుడ్ ఐటమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది వంటకాలే కాకుండా చైనీస్ వంటకాలకూ ఈ హోటల్ స్పెషల్.
Comments
Please login to add a commentAdd a comment