
పట్నం మహేందర్‌రెడ్డి , శంభీపూర్ రాజు
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార టీఆర్‌ఎస్ ఖరారు చేసింది. ఇప్పటికే మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజుకు మరోసారి అవకాశం కల్పించింది. మహబూబ్‌నగర్ నుంచి ఇదే జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డికే మళ్లీ చాన్స్ ఇచ్చింది. వీరంతా సోమవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను ప్రకటించ లేదు. ఆయా పార్టీలకు ఓట్లు తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా తెలిసింది. ఆయా పార్టీలు స్థానిక సంస్థల ఫోరం ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం ఉంది.
ఇదీ లెక్క..
► ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,179 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 627 మంది మహిళలు, 552 మంది పురుషులు ఉన్నారు.
► 310 మంది కార్పొరేటర్లు, 432 మంది కౌన్సిలర్లు, 384 మంది ఎంపీపీలు, 33 మంది జెడ్పీటీసీలు, 20 మంది ఎక్స్‌అఫీషియోలు ఉన్నారు.
► ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, వాటికి 21, 22 తేదీల్లో స్క్రూట్నీ నిర్వహించి 23న తుది జాబితా ప్రకటించనున్నారు.
► ఈ నెల 16 ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. అదే రోజు నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరించి, 24న పరిశీలించి, 26న ఉపసంహరణకు అవకాశం కల్పించారు.
► ఎన్నికల కోసం రాజేంద్రనగర్, వికారాబాద్, తాండూరు, కీసర, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
► డిసెంబర్ 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, 14న ఫలితాలు ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment