
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆవాసాల్లో అసలు తాగునీటి సమస్య తలెత్తొద్దని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో 99 శాతం గ్రామాలు మిషన్ భగీరథ పథకంతో అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. మిగతా ఒక్క శాతాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు.
మిగిలిపోయిన 105 గ్రామాలన్నీ గిరిజన ఆవాసాలే అని తెలిపారు. ఆయా గ్రామాలు సుదూరంగా ఉండడం, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం ఇతర మౌలిక వసతుల సమస్యతో మిషన్ భగీరథ పనులు పూర్తికాలేదన్నారు. అత్యవసర అవసరాల కోసం ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి వసతి కలి్పంచాలని మంత్రి ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, అదనపు సంచాలకుడు సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.