సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో సోమవారం ఉదయం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు.
రంగంలో భవిష్యవాణి వినిపిస్తూ.. మీరు చేసిన పూజలతో నేను సంతోషంగా ఉన్నాను. ఎలాంటి లోపం లేకుండా పూజలు అందుకున్నాను. అయిదు వారాల పాటు నన్ను ముత్తైదులందరూ భక్తిశ్రద్ధలతో కొలుచుకోవాలి. నైవేద్యాలు సమర్పించాలి. నా వద్దకు వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాది. 5 వారాలు నాకు సాక పోయండి నాయన. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు మరిచిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను. నేను మీతోనే ఉంటాను’ అని పేర్కొన్నారు.
కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షల మంది భక్తులు పోటెత్తారని, రాత్రంతా దర్శనాలు జరిగాయని చెప్పారు. సీఎం, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు ఆలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషకరమన్నారు.
చదవండి: చేసే పనీ.. చేటు చేయొచ్చు.. ఉద్యోగాలతో అనారోగ్యాలు
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలకు అన్ని శాఖలు సహకరించాయని, వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని అన్నారు. మరికాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోస్తవం ఘనంగా జరుగుతుందన్నారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు.
కాగా చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment