సమీక్షలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్. చిత్రంలో రాహుల్ బొజ్జ, ఈఎన్‌సీ మురళీధర్ రావు తదితరులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ దక్కుతుందనే అక్కసుతోనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం పక్కన బెట్టిందని, ఈ విషయంలో తెలంగాణ సమాజం కేసీఆర్‌ను క్షమించదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం వల్లే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరు అందించలేక పోతున్నామన్నారు.
శ్రీరాంసాగర్‌లోని నిల్వలు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కూడా సరిపోవని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను రక్షించడం కోసమే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో సోదాలు చేయించామన్నారు. వేసవిలో రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం ఆల్మట్టి నుంచి 10 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో త్వరలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలుస్తామని తెలిపారు.
డిసెంబర్‌లోగా ఆ 18 ప్రాజెక్టులు పూర్తి
తక్కువ నిధులతో తక్కువ వ్యవధిలో సాగునీరు అందించే ప్రాజెక్టులపై దృష్టి సారించినట్టు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. 75 శాతం పూర్తైన 18 ప్రాజెక్టులను వచ్చే జూన్, డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది చివరిలోగా 4.5 లక్షల నుంచి 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు.
గత ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై అడ్డదిడ్డంగా, వృ«థాగా నిధులు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. రూ.10 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరిస్తామని ప్రకటించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సింఛాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద 60 శాతం నిధులు అందించడానికి కేంద్రం సమ్మతి తెలిపిందన్నారు. వారం రోజుల్లోగా ప్రతిపాదనలు సమర్పిస్తామని చెప్పారు.
చెరువులను సిద్ధం చేయాలి
వచ్చే ఐదేళ్లలో ఏ ప్రాజెక్టు కింద ఎంత కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు అనే అంశంపై నివేదిక సమరి్పంచాల్సిందిగా అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. మంథని నియోజకవర్గానికి నీరందించే పనులను సత్వరంగా పూర్తి చేయాలని కోరారు. వచ్చే వేసవికల్లా రాష్ట్రంలోని చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక, పిచ్చి మొక్కల తొలగింపు పనులను చేపట్టాలని ఆదేశించారు. అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా మరమ్మతులు నిర్వహించాలన్నారు.
కోయినా నుంచి 100 టీఎంసీలు అడుగుతాం
మహారాష్ట్రలోని కోయినా ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేసి 100 టీఎంసీల జలాలను అక్కడి ప్రభుత్వం సముద్రం పాలు చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఆ 100 టీఎంసీల నీళ్లను తెలంగాణకు కేటాయించాల్సిందిగా కోరనున్నట్టు మంత్రి తెలిపారు. అందుకు ప్రతిఫలంగా ఆ నీళ్లతో జరగనున్న జలవిద్యుత్‌కు సంబంధించిన వ్యయాన్ని మహారాష్ట్రకు ఇస్తామంటూ ప్రతిపాదిస్తామన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ సి.మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment