విశ్వకర్మ సంఘం నేతలకు ఐదు ఎకరాల స్థలం కేటాయింపు పత్రాలను అందజేస్తున్న మంత్రి గంగుల కమలాకర్.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ వాఖ్యానించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 41 కులాలకు హైదరాబాద్ నడిబొడ్డున రూ.వేల కోట్లు విలువ చేసే 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులిచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు.
ఇప్పటివరకు 24 కులాలు ఏకసంఘంగా ఏర్పాటు కావడంతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనుల బాధ్యతలను ఆయా సంఘాలకు అప్పగించామని తెలిపారు. శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరు కులాలు ఏకసంఘంగా ఏర్పాటు కావడంతో ఆయా సంఘాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణ అనుమతి పత్రాలను గంగుల అందజేశారు. ఇందులో మున్నూరు కాపు, పెరిక, తెలంగాణ మరాఠా మండలి, కుమ్మరి శాలివాహన, విశ్వబ్రాహ్మణ, నక్కాస/ఆరేటి క్షత్రియ కులాలున్నాయి.
గంగుల మాట్లాడుతూ ఆయా కుల సంఘాలకు విద్యాపరంగా, సామాజికంగా, వసతిలో కూడా అత్యుత్తమ సేవలు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటి చందర్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, జల వనరుల సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment