ఒకపక్క– వ్యవసాయాన్ని నామోషీగా భావించి, ఐదారువేల జీతానికే పల్లెలను వదిలి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత.. మరోపక్క– ఉన్నత చదువులు చదివి, లక్షల్లో వేతనం వస్తున్నా.. అందులో లభించని తృప్తిని మట్టిని నమ్ముకుని పొందాలనే తపనతో ఉద్యోగాలొదిలి పల్లెబాట పడుతున్నారు మరికొందరు. పచ్చని పంట పొలాల్లో.. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతూ సంతృప్తి చెందుతున్న చదువుకున్న యువకుల ‘సాగు’ లాభాల పంట పండిస్తోంది.
సాక్షి, జగిత్యాల: ఉద్యోగాలు వదిలి కొందరు, ఉన్నత చదువులు చదివి ఇంకొందరు వ్యవసాయంలోకి దిగుతున్నారు. దాని అనుబంధ రంగాల్లోనూ వస్తున్న కొత్త టెక్నాలజీని ఈ యువ రైతులు అందిపుచ్చుకుంటూ ముందంజలో ఉంటున్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులకు సైతం చెబుతూ, వారిని తమ మార్గంలోకి మళ్లేలా ప్రయత్నిస్తున్నారు. ఆయా రంగాల్లోని యువ రైతులు సంయుక్తంగా తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే చేరవేసేలా మార్కెటింగ్ కూడా చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
‘సోషల్’ సాగు
అంతర్గాంకు చెందిన వామన్‌రెడ్డి బీటెక్ చదివాడు. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో కూరగాయల సాగును చేపట్టాడు. వీటి సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక చేయి సరిగ్గా పనిచేయకున్నా.. తానే అన్ని పనులూ చేసుకుంటాడు. కూరగాయలను స్వయంగా మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల మనుసు గెలుచుకుంటున్నాడు. రైతులు ఎక్కడ మోసపోయినా అక్కడ గళమెత్తడం కూడా వామన్‌రెడ్డి ప్రత్యేకత. రైతులను చైతన్యం చేసేందుకు ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఉపయోగిస్తున్నాడు. వారికి సస్యరక్షణ, ఆధునిక సాగు పద్ధతులపై సలహా సూచనలతో పాటు చైతన్యవంతుల్ని చేసేలా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు.
బంగారు నాటుకోడి గుడ్డు
హైదరాబాద్‌లో బీటెక్ చదివిన సుభాష్‌ది జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. మంచి జీతమే వస్తున్నా.. ఆ జీవితం తృప్తిగా లేకపోవడంతో సొంతూరు తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం నాటుకోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. అందరూ కొత్తలో ఇదేం పనని ఆశ్చర్యపోయినా.. ఈ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. కోళ్ల నుంచి వచ్చిన గుడ్లను ప్రత్యేక పద్ధతుల్లో పిల్లలుగా మారుస్తున్నాడు. నాటుకోళ్లను అందరి మాదిరిగా షెడ్లలో కాకుండా, మామిడి, జామ తోటల్లో పెంచుతూ, డిమాండ్‌ను బట్టి కిలో రూ.250–రూ.300కి విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.
‘పాడి’తో జోడీ
లక్ష్మీపూర్‌కు చెందిన సురేశ్ హైదరాబాద్‌లో ఉంటూ బీటెక్ చదివాడు. కానీ ఎప్పటికైనా స్వయం ఉపాధి కల్పించుకుని తన కాళ్లపై తాను నిలబడాలనేది అతని లక్ష్యం. ఆ మక్కువతోనే స్వగ్రామంలో 30 ఆవులతో డెయిరీ ఫారాన్ని ప్రారంభించాడు. తొలుత నలుగురి భాగస్వామ్యంతో ఫారం నిర్వహించగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం సురేశ్ ఒక్కడే వినూత్న ఆలోచనలతో ఫారం నిర్వహిస్తూ ఏడాదిలోనే లాభాల బాట పట్టించాడు. ఇప్పుడు ఆవులతో పాటు గేదెల డెయిరీ కూడా నిర్వహించి నేరుగా వినియోగదారులకు పాలు విక్రయించేలా వ్యూహరచన చేస్తున్నాడు.
‘ఇంజనీరింగ్’ సేద్యం
లక్ష్మీపూర్‌కు చెందిన స్వామిరెడ్డి ఇంజనీరింగ్ చదివాడు. తల్లిదండ్రులు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని అంటుంటే.. తాను వ్యవసాయం చేస్తానంటూ సేద్యంలోకి దిగాడు. ఇప్పుడు నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అత్యధిక దిగుబడులు సాధిస్తుంటే ఆ తల్లిదండ్రులే మురిసిపోతున్నారు. పసుపు పంటకు డ్రిప్‌తో పాటు ప్రతీ పనికి ఆధునిక పరికరాలను ఉపయోగించడం స్వామిరెడ్డి ప్రత్యేకత. వ్యవసాయ పనులకు ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి, డ్రైవర్ అవసరం లేకుండా తానే డ్రైవింగ్‌చేస్తూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అలాగే, తాను ఆచరించే ఆధునిక సాగు పద్ధతులపై ఇతర రైతులకూ అవగాహన కల్పిస్తుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment