ఆధునిక వ్యవసాయం..లాభదాయకం
ఆధునిక వ్యవసాయం..లాభదాయకం
Published Wed, Jan 11 2017 9:13 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
- రైతులకు అందుబాటులో పరిశోధన ఫలితాలు
- బెట్టను తట్టుకునే నూతన వంగడాల ఆవిష్కరణ
- నంద్యాలలో ఆకట్టుకున్న కిసాన్ మేళా
నంద్యాలరూరల్: ఆధునిక వ్యవసాయం లాభదాయకమని..రైతులు పాత పద్ధతులను విడనాడాలని ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎన్‌వీ నాయుడు, విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని డాక్టర్ వైఎస్సార్ సెంటనరీ హాల్‌లో ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి అధ్యక్షతన కిసాన్ మేళా నిర్వహించారు. అతిథులుగా డాక్టర్ ఎన్‌వీనాయుడు, డాక్టర్ రాజారెడ్డిలు మాట్లాడుతూ.. వ్యవసాయంలో మహిళలు, యువత పాత్ర పెరగాలన్నారు. నంద్యాలను సీడ్‌హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని వారు వివరించారు. తంగడంచ విత్తనోత్పత్తి కేంద్రంలో చిరు ధాన్యాలతో పాటు 21లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి బెట్టను తట్టుకొనే వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారన్నారు. నంద్యాల వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా నాలుగు రకాల కొత్త వంగడాలను ఆవిష్కరించామన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్ పురోగతి సాధించడంతో 2016–17కు ఉత్తమ జాతీయ పరిశోధనా కేంద్రం అవార్డు దక్కించుకుందన్నారు.
కరువు ప్రాంతాల్లో పరిశోధనలు..
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో నూతన పరిశోధనలకు అనువైన ఆధునిక వసతులతో పరిశోధన శాశ్వత భవనాలకు ప్రభుత్వం రూ.14కోట్లు మంజూరు చేసిందని డాక్టర్ ఎన్‌వీనాయుడు, డాక్టర్ రాజారెడ్డిలు తెలిపారు. కరువు ప్రాంతాల్లో కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే సూచనలు అందిస్తారన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తక్కువ వర్షపాతం ఉండటంతో పంటల సాగులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని తూర్పు ప్రాంతమైన నంద్యాలలో విత్తన ఉత్పత్తికి అనువైన వాతావరణం ఉందన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ.. ఆత్మ పథకం ద్వారా రైతులకు విజ్ఞాన యాత్ర నిర్వహిస్తామన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
కిసాన్ మేళాలో ఆకట్టుకున్న స్టాళ్లు..
కిసాన్ మేళా సందర్భంగా నంద్యాల మెడికేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మినీ ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్ల ప్రదర్శనను రైతులు, పాలిటెక్నిక్ విద్యార్థులు తిలకించారు. ప్రైవేటు ఎరువులు, పురుగు మందుల కంపెనీలు కూడా స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు అందజేశాయి.
Advertisement
Advertisement