విజయవంతంగా జీఎస్ఎల్వీ ఎఫ్15 ప్రయోగం
● నిప్పులు చిమ్ముకుంటూ నింగికేగిన రాకెట్ ● క్షక్ష్యలోకి చేరిన నావిక్– ఉపగ్రహం ● షార్ శాస్త్రవేత్తల్లో అవధులు దాటిన ఆనందం ● ప్రతిష్టాత్మక మైలురాయిని అధిగమించిన ఇస్రో
సూళ్లూరుపేట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ విజయవంతంగా రోదసీలోకి దూసుకెళ్లింది. మొత్తం ప్రయోగం 19.10 నిమిషాల్లోనే పూర్తయింది. 2,250 కిలోలు బరువు కలిగిన నావిక్–2 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఐఆర్ఎన్ఎస్ఎస్కు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు సెకెండ్ జనరేషన్ ఉపగ్రహమైన నావిక్–2ను ఇస్రో శాస్త్రవేత్తలు ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగంతో షార్ సగర్వంగా సెంచరీ మైలురాయి మీద నిలబడింది. ఇస్రో ప్రయోగాల పరంపరలో ఎన్నో మైలురాళ్లు దాటింది. అయితే ఇది వందో ప్రయోగం కావడంతో చరిత్ర పుటల్లోకెక్కింది.
గ్యాలరీలో వీక్షకుల సందడి
జీఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆంద్ర, తమిళనాడు, తెలంగాణ, కరార్ణటక రాష్ట్రాల నుంచి సుమారు 6 వేల వరకు తరలివచ్చారు. వందో ప్రయోగం కావడంతో తెల్లవారుజామునే మంచును సైతం లెక్క చేయకుండా వీక్షకుల గ్యాలరీలోకి చేరుకున్నారు. రోదసీలోకి రాకెట్ దూసుకెళతుంటే జయహో భారత్,.. జయహో ఇస్రో.. అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలను చేతపట్టి సగర్వంగా కేరింతలు కొట్టారు. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట వరకు కార్లు, స్కూల్ వ్యాన్లు, బస్సులు బారులు తీరి కనిపించాయి.
శుభాకాంక్షల వెల్లువ
జీఎస్ఎల్వీ ఎఫ్15 ప్రయోగం విజయవంతం కావడంపై ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వంద ప్రయోగాలు పూర్తి చేసి చరిత్ర సృష్టించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, ఇతర శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment