● సి.మల్లవరంలో బరితెగించిన సచివాలయ సిబ్బంది
తిరుపతి రూరల్ : మండలంలోని సి.మల్లవరం పంచాయతీలో సచివాలయ సిబ్బంది బరితెగించారు. కాసులకు కక్కుర్తి పడి ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ రికార్డులు అప్పగించేస్తున్నారు. ఈ మేరకు కొందరు ఇష్టారాజ్యంగా తమకు కావాల్సిన రికార్డులను బీరువాలోకి తీసుకుని వెళ్లిపోతున్నారు. సిబ్బంది నిర్వాకాలపై ఇప్పటికే అనేక పర్యాయాలు ఫిర్యాదులు వచ్చినా.. ఆధారాలు లేకపోవడంతో సర్పంచ్, వార్డు సభ్యులు మిన్నకుండి పోయారు.
పట్టపగలే..
ఇన్నాళ్లకు అవినీతి ఉద్యోగుల పాపం పండింది. మంగళవారం మధ్యాహ్నం సి.మల్లవరం సచివాలయానికి నవీన్, షావలీ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నేరుగా ఇంజినీరింగ్ అసిస్టెంట్ సీట్‌కు వెనుక వైపు ఉన్న బీరువాను తెరిచారు. అత్యంత కీలకమైన హౌసింగ్ రిజిస్టర్‌ను తీసుకుని, అందులోని కొన్ని పేపర్లను ఫొటోలు తీసుకున్నారు. జిరాక్స్ కోసం కొన్ని పేపర్లు పట్టుకెళ్లేందుకు యత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న సర్పంచ్ మొక్కల భారతి వెంటనే సచివాలయానికి వచ్చారు. హౌసింగ్ రిజిస్టర్ పరిశీలిస్తున్న నవీన్, షావలీని అడ్డుకున్నారు. రికార్డు ఎందుకు తీశారని నిలదీశారు. దీంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీసి పరారయ్యారు. బుధవారం ఈ మేరకు కలెక్టర్, డీపీఓకు సర్పంచ్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ రికార్డులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment