కూటమి నేతల
బలం లేకపోయినా ఆధిపత్యం నిరూపించుకోవాలనుకుంటున్నారు. కార్పొరేటర్లను ప్రలోభపెట్టి పీఠం దక్కించుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. కూటమి నేతల కుట్రలను పటాపంచలు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు సన్నద్ధమవుతున్నారు.
● డిప్యూటీ మేయర్ అభ్యర్థికి బెదిరింపులు
● దొడ్డిదారిలో పీఠం ఎక్కేందుకు కుట్రలు
● గతంలో గోడ దూకిన వారు సైతం
వైఎస్సార్‌సీపీలోకి వచ్చేందుకు యత్నం
● పార్టీ మారినా.. కూటమిలో విలువ లేదని
ఆవేదనలో కార్పొరేటర్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘మీ అంతు చూస్తాం.. మీకు సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలుసు. అన్నిటినీ ధ్వంసం చేస్తాం. డిప్యూటీ మేయర్ పోటీ నుంచి విరమించుకో’ అంటూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ శేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులను కూటమి నేతలు బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగినట్లు తెలిసింది. కార్పొరేటర్లకు అండగా నిలబడింది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారం చేతిలో ఉంది కదా అని.. బలం లేకపోయినా దౌర్జన్యంగా అయినా డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు కూటమి నేతలు బరితెగిస్తున్నారు. 50 డివిజన్లలో టీడీపీకి దక్కింది ఒకే ఒక్క స్థానం. మిగిలిన వాటిలో 48 డివిజన్లను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోగా.. ఒక డివిజన్ ఎన్నిక కోర్టులో ఉంది. మేయర్, రెండు డిప్యూటీ మేయర్లుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో డిప్యూటీ మేయర్‌గా ఉన్న భూమన అభినయరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన పదవికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ పదవి కోసం 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. మరో వైపు కూటమి నేతలు తమకు బలం లేకపోయినా పదవిని దక్కించుకునేందుకు కుట్రలకు తెరతీశారు.
బలం లేకపోయినా..
కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బలం లేకపోయినా కార్పొరేషన్‌ని కై వసం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగా కొందరు కార్పొరేటర్లను బెదిరించి, మరి కొందరికి ముడుపులు ఇచ్చి తమ వైపు లాక్కున్నారు. మిగిలిన వారిని కూడా రకరకాలుగా ప్రలోభాలకు గురిచేశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. అధికారం, డబ్బులు ఆశ చూపితే.. కూటమిలో చేరుతారని, వారితో ఏకంగా మేయర్ పీఠం, డిప్యూటీ మేయర్ పదవును దక్కించుకోవచ్చని పన్నాగాలు పన్నిన టీడీపీ, జనసేన నేతల ఆశలు గల్లంతయ్యాయి. వారు అనుకున్నంత మంది కార్పొరేటర్లు కూటమిలో చేరలేదు. ఇప్పటికే వెళ్లిన 12 మంది కార్పొరేటర్ల పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడిన ఎలుకలా మారింది. కూటమిలో వారికి విలువ లేకపోవడం, నాయకులు చులకనగామాట్లాడుతుండడంతో మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు. వీరిలో కొందరు తిరిగి సొంత పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయినప్పటికీ కూటమి నేతలు తమ కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా శేఖర్‌రెడ్డిని పోటీ నుంచి తప్పించాలని పన్నాగాలు పన్నుతున్నారు. శేఖర్‌రెడ్డి కుటుంబాన్ని బెదిరించేందుకు యత్నించినట్లు సమాచారం.
కూటమిలోనే కుమ్ములాటలు
డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి నేతల్లో కుమ్ములాటలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై న ఆర్‌సీ మునికృష్ణ తొలి నుంచి ఆశావహుడిగా ఉన్నారు. టీడీపీ నుంచి పోటీచేసిన వారిలో గెలిచిన ఏకై క కార్పొరేటర్ ఇతనొక్కరే. వైఎస్సార్‌సీపీ నుంచి కూటమి పంచన చేరిన మరో ఇద్దరు కార్పొరేటర్లు సైతం డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఎవరికి వారు పైరవీలు సాగిస్తున్నారు. పనిలో పనిగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పోటీలో లేకుండా చేయాలని కొంత మంది గూండాలతో బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును జనసేన నేతలు కలిసి డిప్యూటీ మేయర్ పీఠంపై చర్చించినట్లు సమాచారం. అయితే కూటమి నేతలు ఎన్ని కుతంత్రాలు చేసినా.. విజయం తమదే అని వైఎస్సార్‌సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment