
నాగఫణిశర్మ.. తెలుగు జాతి ఆణిముత్యం
తిరుపతి సిటీ: బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మను పద్మశ్రీ వరించడం తెలుగుజాతికి గర్వకారణమని, ఆయన తెలుగు ప్రజల ఆణిముత్యమని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరి కొనియాడారు. జాతీయ సంస్కృత వర్సిటీలో శుక్రవారం ద్విసహస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మను వర్సిటీ అధికారులతో కలసి ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ జాతీయ సంస్కృత విద్యాపీఠం పూర్వ విద్యార్థి మాడుగుల నాగఫణి శర్మకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ వరించడం అదృష్టమని, ఆయన నేటి యువతకు ఆదర్శనీయులన్నారు. అనంతరం వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడారు.
విద్యాపీఠం విద్యార్థిగా గర్వపడుతున్నా
జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యనభ్యసించడం అదృష్టంగా భావిస్తున్నాని పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. వర్సిటీ తనను సత్కరించడం విద్యాపీఠం విద్యార్థిగా గర్వపడుతునాని తెలిపారు. వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి, విశ్రాంత ఆచార్యులు కొంపెల్ల రామ సూర్యనారాయణ, మాజీ వీసీ రాళ్లపల్లి రామూర్తి, స్విమ్స్ డీన్ అల్లాడి మోహన్, ఎన్‌ఎస్‌యూ రిజిస్ట్రార్ వెంకట నారాయణరావు, అధ్యాపకులు డాక్టర్ నల్లన్న, సత్యనారాయణ, శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ పాల్గొన్నారు