రామ్‌సర్‌ సైట్‌ ఒక్కటే మార్గం | - | Sakshi
Sakshi News home page

రామ్‌సర్‌ సైట్‌ ఒక్కటే మార్గం

Published Tue, Apr 8 2025 6:59 AM | Last Updated on Tue, Apr 8 2025 6:59 AM

రామ్‌

రామ్‌సర్‌ సైట్‌ ఒక్కటే మార్గం

● పులికాట్‌ సరస్సు సంరక్షణ గాలికి ● ముందుకు సాగని సముద్రముఖద్వారాల పూడికతీత పనులు ● సర్వేలతోనే కాలం నెట్టుకొస్తున్న నేతలు ● అబద్ధాలతో మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం ● పెదవి విరుస్తున్న మత్స్యకారులు, పర్యావరణ వేత్తలు

టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా సముద్ర ముఖద్వారాల పూడికతీత సమస్యను తెరమీదకు తెచ్చి మత్స్యకారులను మోసం చేయడం అలవాటుగా మారిపోయింది. 1994–2004, 2014–19 సంవత్సరాల్లో ఇదేమాదిరిగా మాట ఇచ్చి నిలబెట్టుకోలేక పోయింది. ఇప్పుడేమో సాగరమాల ప్రాజెక్టు ద్వారా రూ.129 కోట్లతో పూడిక తీత పనులు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తోంది. సర్వేలు జరుగుతున్నాయని, నిధులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని బురిడీ కొట్టిస్తోంది.

సూళ్లూరుపేట: ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన పులికాట్‌ సరస్సు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బంగాళాఖాతం ముఖద్వారాల వద్ద పూడిక పేరుకుపోవడంతో ఉప్పు నీటిరాక మందగించింది. విదేశీ విహంగాలతోపాటు మత్స్యకారులకు ఇది గుదిబండగా మారింది.

జీవ వైవిధ్య సరస్సు

ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో సుమారు 620 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులికాట్‌ సరస్సు విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు ఆంధ్రరాష్ట్రం పరిధిలోని నెల్లూరు జిల్లా తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో విస్తరించి ఉంది. మిగిలిన 120 చదరపు కిలో మీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలుకా పరిధిలో విస్తరించి ఉంది. జీవవైవిధ్యాన్ని సంతరించుకున్న రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ప్రతిఏటా వేసవికి ముందే సుముద్ర ముఖద్వారాలకు అడ్డుగా ఇసుక మేటలు పేరుకుపోయి సరస్సు ఎడారిలా మారిపోతోంది. బంగాళాఖాతం నుంచి తమిళనాడు పరిధిలోని పలవేరికాడ్‌ వద్ద ఒక ముఖద్వారం, మన రాష్ట్రంలో రాయదొరువు వద్ద మరొక ముఖద్వారం ఉంది. వర్షాకాలంలో స్వర్ణముఖి, కాళంగినదితో పాటు చిన్నాచితక కాలువల నుంచి మంచినీరు సరస్సుకు చేరుతుంది. సముద్రంలో ఆటుపోట్లు వచ్చి అలల ఉఽఽధృతి పెరిగినపుడు అందులో నుంచి ఉప్పునీరు పులికాట్‌లోకి ప్రవేశిస్తుంది. మంచినీరు, ఉప్పునీరు కలగలసిన సంగమం కాబట్టి దీన్ని జీవి వైవిధ్యం కలిగిన సరస్సుగా పర్యావరణ వేత్తలు గుర్తించారు.

ప్చ్‌..ఫలితం లేదు!

దాదాపు 20 ఏళ్లుగా ఎంతో మంది ఎంపీలు.. నేతలు మాట ఇచ్చి చేతులు ముడుచుకుంటున్నారు తప్ప పులికాట్‌ సంరక్షణకు ఏమాత్రం సహకరించడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నేతల ఒత్తిడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం సర్వేలకే పరిమితమవుతున్నాయి. గత యేడు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్స్‌లోనూ సముద్ర ముఖద్వారాల పూడిక తీత విషయాన్ని నేతలు ప్రముఖంగా ప్రస్తావించి మిన్నకుండిపోయారు.

పోరాడుతున్న ఎంపీ

పులికాట్‌ సరస్సు సంరక్షణకు వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అవిరాళంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. నిధులు మంజూరు చేయించాలని అభ్యర్థించారు. ఆమేరకు ఒత్తిడి తెస్తున్నా చలనం లేకుండా పోతోంది.

పులికాట్‌ సరస్సు చిత్తడి నేలల సరస్సు. ఇరాన్‌ కేంద్రంగా నడుస్తున్న రామ్‌సర్‌ సైట్‌లోకి దీన్ని చేర్చితే పులికాట్‌ సరస్సుకు పూర్వ వైభవం రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చేయాలంటే ముందుగా శాసనసభలో బిల్లు పాస్‌ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. ఆపై దీన్ని ఆమోదించేవరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తద్వారా పులికాట్‌ సరస్సును అభివృద్ధి చేయొచ్చని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

రామ్‌సర్‌ సైట్‌ ఒక్కటే మార్గం 1
1/1

రామ్‌సర్‌ సైట్‌ ఒక్కటే మార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement