
పరిహారం ఇప్పించండయ్యా !
తిరుపతి అర్బన్: ‘రైల్వే లైన్ వేయాలంటూ మా ఇళ్లు తీసుకున్నారు. రెండు నెలల క్రితమే కొట్టేశారు. ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. దూర ప్రాంతంలో ఇంటి పట్టాలు చూపించారు. ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకోవడానికి సాయం చేయలేదు. వీధుల్లో నివాసం ఉంటున్నాం. మేము కూడా మనషులమే సర్’ అంటూ పలువురు సుగాలీలు తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టరేట్‌లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమాచారం అందుకున్న రేణిగుంట మండలం, తూకివాకం పంచాయతీకి చెందిన 26 సుగాలీల కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ మంత్రి చాంబర్ ముందు ఆందోళనకు దిగారు. కొత్త రైల్వే లైన్ వేస్తున్నామంటూ 26 ఇళ్లు కూల్చివేశారని వాపోయారు. అయితే 21 మందికి మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చారని ఆవేదన చెందారు. ఐదు పట్టాలను ఎవరు నొక్కేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని తెలిపారు. న్యాయం కోసం మంత్రిని కలిసి తమ బాధను తెలియజేస్తామంటూ భీష్మించారు. సమాచారాన్ని తెలుసుకున్న తిరుచానూరు పోలీసులు ఎస్‌ఐ జగన్నాథంరెడ్డి నేతృత్వంలో సుగాలీలకు సర్ది చెప్పారు. ఆందోళన వద్దని, తర్వాత జిల్లా అధికారులను కలసి సమస్యను చెప్పుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో వారంతా తిరిగి తూకివాకం వెళ్లిపోయారు.