
సినీ నటుడు సప్తగిరికి మాతృవియోగం
● తిరుపతి గోవిందధామంలో ముగిసిన అంత్యక్రియలు
తిరుపతి రూరల్ : సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టెమ్మ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీలోని నివాసానికి చిట్టెమ్మ భౌతికకాయం తీసుకువచ్చారు. కన్నతల్లి మరణంతో కన్నీటిపర్యంతమైన సప్తగిరి ప్రసాద్‌ను బంధుమిత్రులు ఓదార్చారు. చిట్టెమ్మ మరణంతో సప్తగిరి గుండెలవిసేలా విలపించడం చూపరులను కదలించింది. ఈ క్రమంలో సప్తగిరి మిత్రులు, పరిచయం ఉన్న వ్యాపారులు, రాజకీయ నేతలు, సినీ రంగంలో సన్నిహితంగా ఉండేవారు, అభిమానులు పెద్ద సంభ్యలో తరలివచ్చి చిట్టెమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిరుపతి నగరంలోని గోవింద దామంలో అంత్యక్రియలను పూర్తి చేశారు.