
● ఫలించిన ఎంపీ గురుమూర్తి కృషి
రైల్వే డబ్లింగ్ పనులకు ఆమోదం
తిరుపతి మంగళం: ఎంపీ గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతి–పాకాల–కాట్పా డి రైలు మార్గం డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమో దం తెలిపింది. దాదాపు రూ.1332 కోట్ల అంచనా వ్యయంతో 104 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లో ఈ లైన్ విస్తరించబడి ఉంది. ఈ లైన్ నిర్మాణంతో తిరుపతి, శ్రీకాళహ స్తి పుణ్యక్షేత్రాలకి ప్రయాణ సమయం తగ్గి, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకువచ్చేందుకు ఎంపీ గురుమూర్తి ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించారు. రైల్వే శాఖకు సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓలతో సమావేశమై ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఎట్టకేలకు డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.
నేటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు
తిరుమల : తిరుమలలో గురువారం నుంచి శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు కనులపండువగా వేడుకలు జరిపించనున్నారు. వసంత్సోవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ మేరకు తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేయనున్నారు. స్నపన తిరుమంజనసేవలో సేదతీరనున్నారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశించనున్నారు. ఈ క్రమంలోనే రెండో రోజు సర్వాలంకారభూషితులైన దేవదేవేరులు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. మూడోరోజు మలయప్పతోపాటు రుక్మిణీ సమేత కృష్ణస్వామి, సీతారామలక్ష్మణులు వేర్వేరు పల్లకీల్లో ఊరేగనున్నారు. వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వసంతోత్సవంలో పాల్గొనే భక్తులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.150 చొప్పున 450 టికెట్లను విక్రయించింది.