
పలు కోర్సులకు మంగళం
● ఎస్వీయూలో పలు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు ఇక కనబడవు ● పీజీ సెట్‌లో కానరాని ఆరు ప్రధాన కోర్సులు ● ఆవేదన చెందుతున్న విద్యార్థులు
తిరుపతి సిటీ: అనుకున్నట్టే జరిగింది. ఎస్వీయూలో నూతన కోర్సులు దేవుడెరుగు.. ఉన్న కోర్సులకు మంగళం పాడేస్తున్నారు. ఏపీ పీజీ సెట్‌లో పలు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులను తీసేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆ కోర్సులకు ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏపీ పీజీ సెట్ నుంచి ఎస్వీయూలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను 2025–26 విద్యాసంవత్సరం నుంచి తొలగించినట్లు వీసీ అధికారికంగా ప్రకటించారు.
అధ్యాపకులు రోడ్డు పాలు!
కోర్సుల నిర్వహణ వర్సిటీకి భారంగా మారిందని అధికారులు చెబుతున్న కుంటి సాకులను విద్యార్థి సంఘాల నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు పీజీ సెట్‌లో అనుకున్న కోర్సులో సీటు సాధించలేని పక్షంలో సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. అటువంటి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడం దారుణమని మండిపడుతున్నారు. కోర్సుల్లో ప్రవేశాలను పెంచేందుకు అధికారులు కృషి చేయాలి తప్ప పేదలు ఎక్కువగా చదివే పీజీ కోర్సులను తొలగించడం సమంజసం కాదనిఅంటున్నారు. వర్సిటీలో పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్లను వర్సిటీ నుంచి గెంటివేసి రోడ్డు పాలు చేసేందుకు అధికారులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఏఐఎస్‌ఎప్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఏ, పీడీఎస్‌ఓ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
ఎస్వీయూ పరిపాలనా భవనం
తొలగించిన పీజీ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు
1. ఎంకామ్ (ఎఫ్‌ఎమ్)
2. ఎంఏ ఎకనామిక్స్
3. ఏంఏ తెలుగు
4.ఏంఏ సోషియల్ వర్క్
5. ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్
6. ఎమ్మెస్సీ అనిమల్ బయోటెక్నాలజీ
ఆదరణ లేక ఆపేస్తున్నాం
ఎస్వీయూలో ఆదరణలేని పలు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులను ఏపీ పీజీసెట్–2025 నుంచి తొలగించాం. ఏపీ పీజీసెట్–2025కు దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 2 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే 3,373 దరఖాస్తులు అందాయి. మే 5వ తేదీ వరకు తుది గడువు ఉంది. ఎస్వీయూలో గత కొన్నేళ్లుగా 30శాతం లోపు అడ్మిషన్లు ఉన్న పలు కోర్సులను గుర్తించాం. ఇందులో ఆరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో విద్యార్థులు చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆదరణ లేని ఆ కోర్సులను ఈ ఏడాది పీజీసెట్ నుంచి తొలగించాం. – సీహెచ్ అప్పారావు, వీసీ