
కర్కశంగా మారిన కన్నతల్లి!
● కన్న కూతుర్ని హతమార్చి సహజ మరణంగా చిత్రీకరణ ● నరసింగాపురంలో పరువు హత్య ● ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే హత్య ● వివరాలను వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్
చంద్రగిరి: కన్నతల్లే.. కూతురి పట్ల కర్కోటకంగా మారి కడతేర్చింది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు తలవంపులు తెస్తోందని పరువు హత్యకు పాల్పడింది. ఇతర కులానికి చెందిన యువకుడిని బాలిక(16) ప్రేమించడమే ఆమె పాలిట శాపంగా మారింది. కూతురుని హత్యచేసిన తల్లి చివరకు కటకటాలపాలైన ఘటన శనివారం చంద్రగిరిలో చోటుచేసుకుంది. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని నరసింగాపురం గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. భర్తతో విభేదాలు రావడంతో 11 ఏళ్లుగా తల్లి అదే గ్రామంలో మరొక ఇంట్లో తన ఇద్దరు కుమార్తెలతో ఉంటోంది. బతుకుదెరువు కోసం తిరుమలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం తన పెద్ద కుమార్తె (16), మిట్టపాళెం గ్రామానికి చెందిన అజయ్‌ని ప్రేమించింది. దీనిపై అప్పట్లో అజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అజయ్‌ను రిమాండ్‌కు తరలించారు. అప్పట్లో బాలిక గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా నాటు వైద్యం ద్వారా గర్భస్రావం చేశారు. అయితే అప్పట్లో బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇదిలా ఉండగా రిమాండ్ ఖైదీగా ఉన్న అజయ్‌ని సబ్‌జైలుకు వెళ్లి తరచూ పరామర్శిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. సబ్‌జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన అజయ్‌తో బాలిక తరచూ సెల్‌ఫోన్‌లో చాటింగ్‌లు చేయడం, మాట్లాడడంపై తీవ్రంగా మండిపడ్డారు.
తనను చంపేస్తారని ముందే తెలిసి
తన కుమార్తె ప్రియుడు అజయ్‌తో చాటింగ్ చేయడం, ఫోన్‌లో మాట్లాడడాన్ని తల్లి గ్రహించింది. దీంతో కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం బాలికను విషం పెట్టి చంపేసేందుకు తన తల్లి కుట్ర పన్నుతోందంటూ ప్రియుడికి వాట్సప్ ద్వారా మెసేజ్‌లు పెట్టినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆపై కొద్దిరోజుల్లోనే బాలిక మృతి చెందింది.
ముక్కు, నోరు మూసివేసి!
ఇంట్లో నిద్రస్తున్న బాలికను ఆమె తల్లే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 4వ తేదీన ఇంట్లో ఉన్న బాలిక ముక్కు, నోరు మూసివేసి హత్య చేసినట్లుగా నిందితురాలు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. బాలిక హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకూడదనే ఉద్దేశంతో గంటల వ్యవధిలో దహనం చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వేరొక కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతోనే తన కుమార్తెను హత్య చేసిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు నిందితురాలిని శనివారం అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన మీడియాకు వివరించారు. కేసు నమోదు చేసిన 72 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన సిబ్బందికి డీఎస్పీ రివార్డులను అందజేశారు. సీఐ సుబ్బరామిరెడ్డి, ఎస్‌ఐ అనిత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.