సత్వరం ప్రారంభించాలి
● కలెక్టర్ ప్రతీక్‌జైన్ ● ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష
అనంతగిరి: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్వరం ప్రారంభించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 126 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్వింటాలు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300, సన్న రకం వడ్లకు అదనంగా రూ.500 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 34, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 61, డీసీఎంఎస్ ఆధ్యర్యంలో 31 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18 కేంద్రాల్లో సన్న రకం వడ్లు కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఆరబెట్టిన, చెత్త, తేమ లేకుండా ధాన్యం తేవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ధాన్యం నింపేందుకు గోనె సంచులు, తరలించేందుకు వాహనాలను సమకూర్చుకోవాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి మోహన్‌బాబు, జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment