న్యాయం జరిగేలా చూస్తాం
● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ● లగచర్ల ఘటనపై పూర్తి నివేదికనుసీఎంకు సమర్పిస్తామని వెల్లడి
పరిగి: లగచర్ల రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. లగచర్లలో బాధిత రైతు కుటుంబాలను కలిసేందుకు వెళ్తున్న బృందం సభ్యులు సోమవారం పరిగి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఫార్మాసిటీ భూ బాధిత రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూడటం సరికాదన్నారు. భూ సేకరణ పేరుతో అధికారులు గ్రామాలు, తండాల్లో సభలు నిర్వహించి రైతులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. లగచర్ల ఘటనలో ఎవరో కొంత మంది కలెక్టర్, అధికారులపై దాడి చేస్తే రైతులందరిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. లగచర్ల ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కోరామన్నారు. బాధిత రైతులను కలిసి పూర్తి సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, రాము బాబునాయక్, డీబీఎఫ్ జాతీయ క్యాదర్శి, జిల్లా నాయకుడు శంకర్, ప్రజా సంఘాల నాయకులు ఘట్యనాయక్, ముకుంద నాగేశ్వర్, శ్రీనివాస్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణం కల్పించండి
అనంతగిరి: లగచర్ల, రోటిబండ తండాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చొరవ చూపాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. ఫార్మాసిటీ గ్రామాల సందర్శన అనంతరం వారు వికారాబాద్ సమీపంలోని అనంతగిరికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లగచర్ల, రోటిబండ తండా గ్రామాలను తమ బృందం సందర్శించి అక్కడి ప్రజలతో సమావేశమైనట్లు తెలిపారు. తండావాసులు భయాందోళనలో ఉన్నారని, ఫార్మాసిటీకి భూములు పోతే మా పిల్లలు ఏం చేసుకుని బతకాలనే బాధను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కలెక్టర్, అధికారులపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని రైతులకు చెప్పామని అన్నారు. భూములు ఇవ్వమనే విషయాన్ని శాంతియుతంగా చెప్పాలి కదా అని సూచించినట్లు తెలిపారు. అమాయకులపై కేసులు పెట్టారని వారు మా దృష్టికి తెచ్చారని, దాడితో సంబంధం లేని వారిపై కేసులు ఎత్తి వేయాలని ఎస్పీకి ఆదేశించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment