విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
కొడంగల్ రూరల్: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, తెలుగు, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని, స్టోర్ రూమ్‌లోని బియ్యంను పరిశీలించారు. బియ్యంలో పురుగులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. వారంలో ఎన్ని సార్లు గుడ్లు ఇస్తున్నారని, కూరగాయలు, సరుకులు నాణ్యతగా ఉన్నాయా, వంట రుచికరంగా ఉందా అని ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, ఎంఈఓ రాంరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాధికారాన్ని
చేజిక్కించుకుంటాం
బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్
తాండూరు టౌన్: భవిష్యత్‌లో బీసీలు రాజ్యాధికారం చేజిక్కించుకోవడం ఖాయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో తలపెట్టిన బీసీల సమరభేరి సభకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. చట్ట సభల్లో బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీలంతా ఏకమై రాజ్యాధికారం చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, వెంకటేశ్, మధులత, లక్ష్మణాచారి, బస్వరాజ్, నరేందర్, బసంత్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
సత్ప్రవర్తనతో మెలగాలి
న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి డీబీ సీతల్
పరిగి: క్షణికాశంలో తప్పు చేసి జైలుకు వెళ్లడం ద్వారా కుటుంబం మొత్తం క్షోభిస్తుందని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డీబీ సీతల్ అన్నారు. సోమవారం ఆమె పరిగి సబ్ జైలును సందర్శించారు. ఖైదీల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోజువారి దినచర్య, వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులను పునరావృత్తం కాకుండా చూసుకోవాలన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత రెండో సారి ఇక్కడికి రాకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కుటుంబంపై బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, లీగల్ డిఫెన్స్ లాయర్ రాము, వెంకటేష్, శ్రీనివాస్, గౌస్‌పాష పాల్గొన్నారు.
కుటుంబ సర్వే పూర్తి
ఇబ్రహీంపట్నం: మండల పరిధిలో కులగణన సర్వే పకడ్బందీగా సాగుతోందని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి, ఇబ్రహీంపట్నం స్పెషలాఫీసర్ కె.నవీన్‌కుమారెడ్డి అన్నారు. సోమ వారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని 14 పంచాయతీల్లో 11,151 ఇళ్లను గు ర్తించి 110 ఎన్యుమరేటర్ బ్లాక్‌లను ఏర్పాటు చేసి సర్వే చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 10,984 ఇళ్లను సర్వే(98.5శాతం) పూర్తి చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment