డేటా ఎంట్రీని వేగవంతం చేయండి
కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. సోమ వారం మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయంలో డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. అవసరం అయితే సిబ్బందిని నియమించుకొని డేటా ఎంట్రీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ ఒకే గదిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్‌కు సూచించారు. అంతకుముందు వికారాబాద్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. వంటగది, కిచెన్, విద్యార్థుల భోజనాన్ని పరిశీలించారు.
పాఠశాలలకు నిధుల విడుదల
జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థ, ఆదర్శ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ(మూడు నెలలకు గాను)కు రూ.1.68 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలల పరిసరాలు, మరుగుదొడ్లు నిర్వహణకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రజావాణికి 113 దరఖాస్తులు
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పలు సమస్యలపై ప్రజలు ఇచ్చే దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు గల కారణాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment