బోర్డులతో సరి | - | Sakshi
Sakshi News home page

బోర్డులతో సరి

Published Tue, Nov 26 2024 7:37 AM | Last Updated on Tue, Nov 26 2024 7:37 AM

బోర్డులతో సరి

బోర్డులతో సరి

అలంకారప్రాయంగాక్రీడా ప్రాంగణాలు
● స్థలం కేటాయించి వదిలేసిన వైనం ● పిచ్చిమొక్కలతో నిండిన మైదానాలు ● క్రీడా పరికరాలు మంజూరు చేయని ప్రభుత్వాలు ● ఆటలకు నోచుకోని గ్రామీణ క్రీడాకారులు

ధారూరులో నిరుపయోంగా క్రీడా ప్రాంగణం

వికారాబాద్‌: తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారాయి. మూడేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామపంచాయతీలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన స్థలాన్ని చదును చేసి బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతో నిరుపయోగంగా మారాయి. అప్పట్లో పలు చోట్ల స్థల వివాదాల కారణంగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు తహసీల్దార్లు నానా ఇబ్బందులు పడ్డారు. భూమి కేటాయించిన తర్వాత ప్రభుత్వం క్రీడా సామగ్రి పంపిణీ చేయలేదు. కేవలం భూమిని చదును చేసి వదిలేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చక్కటి ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నా ఆడుకునేందుకు సరైన స్థలం, క్రీడా పరికరాలు లేక మరుగున పడుతున్నారు.

అరకొర స్థలంలో..

క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో వాటిని వినియోగించడం లేదు. ప్రస్తుతం గడ్డి, పిచ్చి మొక్కలతో నిండిపోతున్నాయి. అర ఎకరంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో క్రికెట్‌ ఆడేందుకు వీలు లేదని పలువురు క్రీడాకారులు అంటున్నారు. కనీసం మూడు ఎకరాల స్థలం ఉంటే అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఒకే చోట స్థలం అందుబాటులో లేకుంటే రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక చోట క్రికెట్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసు కోవాలని అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణకు ఏటా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, వాటి నిర్వహణ బాధ్యతలు గ్రామ పంచాయతీలకు అప్పగించి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తే వాటి వినియోగం బాగుంటుందని పలువురు పేర్కొన్నారు.

585 జీపీల్లో మైదానాలు

జిల్లాలోని 585 గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. 2 వేల చదరపు గజాలు లేక 20 గుంటల భూమికి తగ్గకుండా కేటాయించారు. ఇందుకోసం గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిని, అటవీ భూములను సేకరించారు. స్థలాల అభివృద్ధికి రూ.50వేల వరకు ఖర్చు చేశారు. ప్రభుత్వ భూమి లేనిచోట జీపీల్లో లేఅవుట్లు చేస్తే వాటి ద్వారా సామాజిక అవసరాల కింద ఇచ్చే 10 శాతం భూమిని క్రీడా ప్రాంగణాల కోసం గుర్తించేందుకు వీలు కల్పించారు. ఇలా జిల్లా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. అయితే మౌలిక వసతులు కల్పించకపోవడం, క్రీడా సామగ్రి మంజూరు చేయకపోవడంతో మైదానాలు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి ఆటలు ఆడేందుకు అనుకూలంగా లేదు. ఆటల వారీగా కోర్టుల నిర్మాణం చేస్తే బాగుంటుందని క్రీడాకారులు అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవడంతోపాటు క్రీడా సామగ్రి, ఏటా ప్రత్యేక నిధులు కేటాంచాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement