సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుంది అటు జనసేన, ఇటు టీడీపీ నేతల పరిస్థితి. టీడీపీతో జతకడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న ఆందోళన ఇరు పార్టీల నేతల్లోనూ వ్యక్తమవుతోంది. తొలి నుంచి పార్టీలో ఉండటంతో పాటు గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో తమ సీటు గల్లంతవుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పొత్తులో ఏయే సీట్లను కేటాయిస్తారో... అందులో తమ సీటు ఎక్కడ ఉంటుందోనని టీడీపీ నేతల్లోనూ గుబులు మొదలైంది.
ప్రధానంగా పెందుర్తి, భీమిలి, విశాఖ ఉత్తర, పశ్చిమ, దక్షిణ, యలమంచిలి, చోడవరం, గాజువాక, పాయకరావుపేట వంటి నియోజకవర్గాల్లో అగమ్యగోచర పరిస్థితి నెలకొని ఉంది. తమకు సీటు కేటాయించని పక్షంలో తమ భవిష్యత్ ఏమిటో తేల్చుకుంటామనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అంతేకాకుండా సీటు ఆశించి తాజాగా జనసేనలో చేరిన అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉన్న చోట ఉండకుండా... ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియని ఇటువంటి పార్టీలో ఎందుకు చేరామోనంటూ తలలపట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా పొత్తు ప్రకటన తర్వాత కేడర్‌లో ఉత్సాహం రావాల్సిన పరిస్థితి నుంచి దిక్కుతోచని దుస్థితికి తీసుకొచ్చారనే అభిప్రాయం ఇరు పార్టీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.
నియోజకవర్గాల వారీగా..! ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ–జనసేన పొత్తులో సీట్లలో తకరారు ఏర్పడే పరిస్థితి నెలకొని ఉంది. పెందుర్తితో మొదలుకొని విశాఖ ఉత్తర, పశ్చిమ, దక్షిణ, భీమిలి, గాజువాక, యలమంచిలి, చోడవరం, పాడేరు ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇరు పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న అభ్యర్థుల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితులున్నాయి. పైగా పొత్తు కోసం జనసేన నుంచి ప్రకటన రావడంతో తమకు ఇచ్చే సీట్ల సంఖ్య కూడా తక్కువే ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే, టీడీపీ అవసరం కోసం అర్రులు చాస్తున్నందున.... తమ పార్టీకి సీట్లు తక్కువగా వస్తే తమ పరిస్థితి ఏమిటని టీడీపీ నేతలు సందిగ్ధంలో పడ్డారు. మొత్తంగా ఇరు పార్టీలకు చెందిన పరిస్థితిని నియోజకవర్గాల వారీగా గమనిస్తే..
► పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇప్పటికే టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఉన్నారు. అక్కడ సీటు ఆశించి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్‌బాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెందుర్తి నుంచి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పంచకర్ల... ఇప్పుడు పైనుంచి వచ్చిన ఆదేశాలతో పొత్తును స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. అయినప్పటికీ పొత్తు కాస్తా తనకు ఎసరు పెట్టిందని అనుచరుల వద్ద వాపోతున్నట్టు తెలుస్తోంది.
► గాజువాక నుంచి తిరిగి కోన తాతారావు, తిప్పల రమణారెడ్డిలు జనసేన పార్టీ నుంచి సీటును ఆశిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఉన్న తన పరిస్థితి ఏమిటని టీడీపీకి చెందిన పల్లా శ్రీనివాసరావు మండిపడుతున్నారు. నియోజకవర్గాన్ని వదులుకుంటే ఇక రాజకీయాల్లో పక్కకు తప్పుకోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ... గాజువాక సీటును వదులుకునేది లేదని చెబుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే జనసేన నేతలు టీడీపీకి సహకరించే పరిస్థితి ఉండదని తెలుస్తోంది.
► విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గతంలో జనసేన నుంచి పోటీ చేసిన పసుపులేటి ఉషాకిరణ్... తనకు సీటు ఇవ్వకపోతే తన దారి తాను చూసుకునే పరిస్థితి ఉందని సమాచారం. ఇక్కడ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు.
► విశాఖ దక్షిణ నుంచి మూగి శ్రీనివాస్, బీశెట్టి వసంతలక్ష్మితో పాటు తాజాగా ఆ పార్టీలో చేరిన కార్పొరేటర్ కందుల నాగరాజు సీటు ఆశిస్తున్నారు. ఇప్పుడు పొత్తులో ఈ సీటు కాస్తా టీడీపీకి వెళితే తమ పరిస్థితి ఏమిటంటూ వాపోతున్నారు. ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా గండి బాబ్జీ వ్యవహరిస్తున్నారు.
► గతంలో జనసేన నుంచి భీమిలిలో పోటీచేసిన పంచకర్ల సందీప్ సీటు తనకేనని ప్రకటించుకుంటున్నారు. ఇక్కడ ఏ పార్టీకి సీటు వచ్చినా.. ఇరు పార్టీల అభ్యర్థులు సహకరించుకునే పరిస్థితి లేదు.
► విశాఖ పశ్చిమలో జనసేన నుంచి పీలా రామకృష్ణ సీటు ఆశించి పార్టీలో పనిచేస్తున్నారు. ఇది టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కావడంతో జనసేనకు హ్యాండ్ ఇస్తారని తెలుస్తోంది.
► విశాఖ తూర్పులో జనసేన నుంచి బొలిశెట్టి సత్య నారాయణ సీటు ఆశిస్తున్నారు. టీవీ చర్చల్లో ఎంత వాదించినా... పొత్తులో తన సీటు గోవిందా అని భోరుమంటున్నారు.
► ఇక గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన పీవీఎస్‌ఎన్ రాజు (చోడవరం), అనకాపల్లి నుంచి పోటీ చేసిన పరుచూరి భాస్కరరావు పొత్తులో తమ సీటు ఏమవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
► యలమంచిలిలో జనసేన నుంచి సుందరపు విజయ్‌కుమార్‌కు సీటు కేటాయిస్తే... టీడీపీ నుంచి సీటు ఆశిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.
► పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన తరపున పనిచేస్తున్న శివదత్‌కు మొండిచేయి చూపించేలా ఉంది. అదేవిధంగా అరకు నియోజకవర్గం నుంచి సాయిబాబా, పాడేరు నుంచి గంగులయ్య, పద్మలు కూడా జనసేన కోటాలో తమకు సీటు రాకపోతే తమ దారి తమదే అనే రీతిలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇరు పార్టీ నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొంది. పైన ప్రకటించినంత సులభంగా నియోజకవర్గాల్లో పొత్తు నెలకొనే పరిస్థితి లేదని ఇరు పార్టీల నేతలే ప్రకటిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment