మహారాణిపేట : ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని రితీ సాహా కేసుకు సంబంధించి కేజీహెచ్‌లో విచారణ మొదలైంది. అయిదుగురు వైద్యులతో కూడిన విచారణ కమిటీ మంగళవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విచారణ నిర్వహించింది. పలువురి నుంచి వివరాలు సేకరించిన కమిటీ మరోసారి విచారణ చేయాలని నిర్ణయించింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన రితీ సాహా జూలై 14వ తేదీన ఆ కళాశాల అవుట్‌సోర్సింగ్ ద్వారా నిర్వహిస్తున్న సాధన హాస్టల్ భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
తీవ్రంగా గాయపడిన ఆమెకు ముందుగా వెంకటరామ ఆస్పత్రిలోను, తరువాత కేర్ ఆస్పత్రికి చికిత్స అందించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందని మృతురాలి తండ్రి డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ పి.అశోక్‌కుమార్‌కు డీఎంహెచ్‌వో సూచించడంతో కేజీహెచ్ న్యూరో మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ బి.హయగ్రీవరావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ వి.సత్యప్రసాద్, అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ వి.రవి, కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మణిత, ఆర్థోపెడిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.రజనీ కుమార్‌లతో విచారణ కమిటీ వేశారు.
మంగళవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించిన కమిటీ విచారణకు రితీ సాహా తల్లిదండ్రులు, చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు, ల్యాబ్ సిబ్బంది, నిర్వాహకులు హాజరయ్యారు. అన్ని రికార్డులు, రిజిస్టర్లతో పాటు సీటీ ఫిల్మ్ అండ్ రిపోర్ట్, ఎక్స్ రే ఛాతి ఫిల్మ్, రిపోర్ట్, సీటీ బ్రెయిన్ రిపోర్ట్, డెత్ కేసుకు సంబంధించిన ఇతర నివేదికలు విచారణ కమిటీకి సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment